టీడీపీ కౌన్సిలర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి
నర్సీపట్నం: మున్సిపల్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న టీడీపీ కౌన్సిలర్లు ఎప్పటి మాదిరిగానే కౌన్సిల్ సమావేశానికి అడ్డంకులు సృష్టించారు. సభ సజావుగా సాగకుండానే.. కనీసం ప్రజా సమస్యలు ప్రస్తావించకుండానే.. అధికార పార్టీ కౌన్సిలర్లపై ఏకవచనంతో దురుసుగా ప్రవర్తించారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య సైతం ఏకవచనంతో మాట్లాడటంపై చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాటి మహిళను గౌరవించటం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.
ప్రధానంగా మెయిన్ రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న బాలికల వసతిగృహం, ఆర్డీవో కార్యాలయం ప్రహరీ పునర్నిర్మించడానికి మున్సిపల్ సాధారణ నిధులు కేటాయించటంపై టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రస్తావించిన సమస్యలపై చర్చించకుండా వెళ్లిపోవటం సరికాదని వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అన్నారు. దాంతో చాల్లెండి.. సిగ్గు పడండి.. అని టీడీపీ కౌన్సిలర్ పద్మావతి ఎగతాళి చేశారు. సిగ్గుపడే బయటకు వెళ్తున్నారని మరో వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు చురకంటించడంతో ఆమె అతని వైపు దూసుకొచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
వైస్ చైర్మన్ అప్పలనాయుడును టీడీపీ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఏకవచనంతో ‘ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు’ అంటూ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే చైర్‌పర్సన్ తన కుర్చీలో నుంచి లేచివచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభ్యులను ఏకవచనంతో మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల కేకలు, అరుపులతో సభ దద్దరిల్లింది. సభ నుంచి టీడీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య.. రెండు నెలల్లో మార్పు తెస్తానన్నారు.. ఏమి మార్పు తెచ్చారని ప్రశ్నించారు. సమస్యలు ప్రస్తావించడానికి వచ్చావా.. రాజకీయ ఉపన్యాసం చేయడానికి వచ్చావా అని చైర్‌పర్సన్ కౌంటర్ ఇచ్చారు. వినే ఓపిక లేనప్పుడు సమస్యలు ప్రస్తావించకూడదన్నారు. సమావేశంలో కమిషనర్ పూడి రవిబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment