సొంత జిల్లా నుంచి 200 మందికి పైగా రాక
ఐదు గ్రామాలకు ఒకరు ఇన్‌చార్జ్
పట్టణ ప్రాంతాల్లోని లాడ్జీల్లో మకాం
టీడీపీ కార్యకర్తల పేరిట గదుల బుకింగ్
రహస్య ప్రదేశాల్లో మద్యం డంప్‌ల ఏర్పాటు!
సాక్షి, అనకాపల్లి: ప్రశాంతతకు మారుపేరుగా పేరొందిన అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. వారి కదలికలు సందేహాస్పదంగా ఉంటున్నాయి. వారి కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి సీఎం రమేష్ సాగిస్తున్న రౌడీ రాజకీయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
సీఎం రమేష్ అనుచరులైన రౌడీ మూకలు గ్రామాల్లో తిష్ట వేశాయి. స్థానికేతరుడైన ఆయనకు కూటమి నుంచి ఎంపీ టికెట్ ప్రకటించినప్పటి నుంచి.. మనుషులు మొదలుకొని ప్రచార వాహనాల వరకు అన్నీ తన స్వస్థలం కడప నుంచే తెచ్చుకున్నారు. 200మందికి పైగా అనుచరులను అనకాపల్లి జిల్లాకు రప్పించుకున్నారు.
జిల్లాలో పట్టణ ప్రాంతాలైన అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల, సబ్బవరం, పెందుర్తిలలో ఉన్న లాడ్జీలలో వీరు మకాం చేశారు. ఈ పట్టణాల్లో శివారున ఉన్న లాడ్జిల్లో స్థానిక టీడీపీ కార్యకర్తల పేరిట రూమ్‌లు బుక్ చేశారు. కొన్ని రహస్య ప్రాంతాల్లో మద్యం డంపులను కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల యలమంచిలి నియోజకవర్గం సోమలింగంపాలెంలో భారీగా గోవా మద్యం పట్టుబడింది.
ఇందులో ప్రధాన నిందితుడు కర్రి వెంకటస్వామి టీడీపీకి చెందిన కార్యకర్త కావడం.. గోవా నుంచి కంటైనర్‌లో భారీగా మద్యం అనకాపల్లికి దిగుమతి చేయడం.. ఇక్కడ యలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సమావేశానికి మద్యం సరఫరా చేయడం వంటివి గమనించిన పోలీసులు దీని వెనక బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఉన్నారా..? అని అనుమానిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురినీ పోలీసులు విచారిస్తున్నారు. జిల్లాలో ఇంకేమైనా ఇలాంటి డంపులు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు గ్రామాలకు ఒక్కరు..
సీఎం రమేష్ తన అనుచరులను ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండల కేంద్రాలకు పంపించేశారు. ప్రతి ఐదు గ్రామాలకు ఒకరు చొప్పున జిల్లాలో ఉన్న 24 మండలాలతోపాటు పెందుర్తిలో కూడా వారిని మోహరించారు. సీఎం రమేష్ సమావేశాలు, టీడీపీ, జనసేన స్థానిక నేతల మీటింగ్‌లు, కుల సంఘాల సమావేశాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకుని వారే సొమ్ము చెల్లిస్తున్నారు. సమావేశాల్లో పాల్గొనే నాయకులు, కార్యకర్తల ఆటో ఖర్చులు, వారి భోజనం ఖర్చులు, సమావేశ మందిరం అద్దెల చెల్లింపు వారి చేతుల మీదుగా జరుగుతోంది.
పవన్ వారాహి యాత్రకు రూ.50 లక్షలు
అనకాపల్లి జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన వారాహి యాత్ర, బహిరంగ సభ జన సమీకరణకు ఖర్చంతా సీఎం రమేష్ పెట్టుకున్నారు. సభ ఏర్పాట్లకు, జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన జనానికి సుమారు రూ.50 లక్షలు వెచ్చించినట్టు సమాచారం. ఈ ఏర్పాట్లను కూడా సీఎం రమేష్ అనుచరులే దగ్గరుండి చూసుకున్నట్లు భోగట్టా.
వచ్చీ రాగానే ఘర్షణ మొదలు
రమేష్ అడుగు పెట్టారో లేదో.. అప్పుడే తనదైన రౌడీ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. చోడవరంలో అధికారులపై దౌర్జన్యం, నర్సీపట్నంలో బహిరంగంగా చీరల పంపిణీ, గ్రామాల్లో సీఎం రమేష్ అనుచరుల హల్‌చల్ వంటి పరిణామాలను జిల్లా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారన్న భావం వారి మనసుల్లో అప్పుడే నాటుకుపోయింది. స్థానిక బీజేపీ నేతలు ఉండగా ప్రచార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలను పూర్తిగా తన మనుషులకు అప్పగించడం పార్టీ జిల్లా వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తించింది. మామీద నమ్మకం లేదా అని వారు మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment