అయ్యన్న కండువాల రాజకీయంపై జనసేన గరం
పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ నాయకులను టీడీపీలో చేర్చుకోవడంపై అసంతృప్తి
నర్సీపట్నం : ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కండువాల రాజకీయానికి తెరలేపారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇరుపార్టీలు వలసలు ప్రోత్సహించుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు. కానీ అయ్యన్నపాత్రుడు మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టి జనసేన నాయకులను టీడీపీలో చేర్చుకోవడానికి శ్రీకారం చుట్టారు.
నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న జనసేన క్యాడర్‌కు అయ్యన్నపాత్రుడు వ్యవహారశైలి మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు అయ్యన్నపాత్రుడు చోటామోటా నాయకులకు కండువాలు వేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు ప్రోత్సహిస్తున్న వలసలతో నియోజకవర్గంలో జనసేన కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి గ్రామానికి చెందిన గజాల నాగరత్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర, పూడి చక్రవర్తి, అద్దేపల్లి గణేష్ నాగరత్నంను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ దంపతులు గజాల నాగరత్నం, సూరిబాబుతో పాటు నలుగురు వార్డు మెంబర్లు మంగళవారం అయ్యన్నపాత్రుడు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మిత్ర ధర్మానికి అయ్యన్నపాత్రుడు తూట్లు పొడవడంతో పలువురు విస్మయం చెందుతున్నారు. అయ్యన్నపాత్రుడు కండువా రాజకీయంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment