సీఎం రమేష్ జేబులో తెలుగుదేశం
పైలా అవుట్.. బండారు ఇన్?
గవిరెడ్డి, పీవీజీ కుమార్‌లకు రూ.కోట్లలో ఎర!
రమేష్ వైఖరిపై కుతకుతలాడుతున్న టీడీపీ క్యాడర్
ఎలా గెలుస్తారో చూస్తామంటున్న పైలా ప్రసాద్ వర్గీయులు
చంద్రబాబు పంపితేనే అనకాపల్లి వచ్చా.. ఉత్తరాంధ్ర టీడీపీకి ఒకప్పుడు ఎర్రన్నాయుడు పెద్దదిక్కుగా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తా.. అంటూ ఈమధ్య సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇప్పుడు ఏకంగా మాడుగుల తెలుగుదేశం అభ్యర్థి పైలా ప్రసాదరావునే మార్చేలా పావులు కదపడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మీద బీజేపీ నేత పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నాయి. రమేష్ రాజకీయానికి మాడుగుల టీడీపీలోని రెండు వర్గాలు అమ్ముడుపోవడం క్యాడర్‌ను కుంగదీస్తోంది.
సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు చీదరించుకొని టికెట్ ఇవ్వను పొమ్మన్న నేతలందరూ ఒక్కటవుతున్నారు. పోయిన పరువును కాస్త కూడదీసుకునేందుకు తంటాలు పడుతున్నారు. వీరిని సీఎం రమేష్ చేరదీస్తున్నారు. వారిని కొనేసి తనకు అనుకూలమైన వ్యక్తిని తెచ్చి పెట్టేందుకు ఆయన చేసిన యత్నాలు కొలిక్కివచ్చాయని తెలుస్తోంది. మాడుగుల అభ్యర్థిగా పైలా ప్రసాదరావు బదులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు మాడుగులలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ఆశలను మరింత ఆవిరి చేస్తాయేమోనన్న భయాందోళనలను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడికి టికెట్ దక్కలేదు.
ఆయనను కాదని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించిన పీవీజీ కుమార్‌కు కూడా చంద్రబాబు ఆశీస్సులు లభించలేదు. తమను కాదని పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించడంపై వీరిద్దరూ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరినీ తాయిలాలతో ప్రసన్నం చేసుకొని టీడీపీ అభ్యర్థి పైలాకు ఎసరు పెట్టడానికి సీఎం రమేష్ నడుం బిగించారు. తనకు సన్నిహితుడైన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని తెచ్చుకునేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇందుకు గవిరెడ్డి, పీవీజీలకు రూ.4 కోట్లు, రూ.2 కోట్లు ముట్టచెప్పినట్టు సమాచారం. రమేష్ టీడీపీ నేతలపై పైసలతో పెత్తనం చెలాయించడం.. తమ నేతలు అమ్ముడుపోయారన్న విషయం ప్రజల్లో తమ పార్టీని చులకన చేస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది.
పైలా రాజీనామా యోచన?
అసలు స్థానికేతురుడైన సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడమే తప్పు.. దీనికి తోడు చక్కగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీలో అగ్గి రాల్చుతున్నాడంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. స్థానికులను కాదని పొరుగు నియోజకవర్గాల నుంచి ఇక్కడకు తీసుకొస్తే సహించేది లేదని ప్రసాదరావు వర్గీయులు చెబుతున్నారు. అభ్యర్థి మార్పు జరిగితే తర్వాత జరిగే పరిణామాలు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ బండారుకు ప్రకటిస్తే.. పైలా ప్రసాదరావుతోపాటు ఆయన వర్గీయులు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అధినేత వైఖరితో డీలా పడ్డ టీడీపీ క్యాడర్
ఒకప్పుడు చంద్రబాబు వ్యూహాలు పదునుగా ఉండేవి. ఎత్తు వేస్తే ప్రత్యర్థులు చిత్తు కావలసిందే అన్న రీతిలో పావులు కదిపేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన నిర్ణయాలు పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు. అనకాపల్లి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించారు. చాలాకాలంగా ప్రజలు మరచిపోయిన కొణతాల రామకృష్ణ ఆ టికెట్ దక్కించుకున్నారు. అనకాపల్లి పార్లమెంటు సీటు బీజేపీకి వదులుకున్నారు. అక్కడికి రాయలసీమ నుంచి సీఎం రమేష్‌ను తీసుకొచ్చారు. స్థానికేతరుడు మాకెందుకని ఒకపక్క టీడీపీ కార్యకర్తలు తల పట్టుకుంటుంటే.. చంద్రబాబే పంపారని రమేష్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు నెల రోజుల క్రితమే చంద్రబాబు ప్రకటించిన పైలా ప్రసాదరావు.. సీఎం రమేష్ తలచుకున్నంతనే మారిపోతున్నారు. అధినేత స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న భయం పార్టీ క్యాడర్‌ను వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment