బలం లేకపోయినా అవిశ్వాసమా?
● మేయర్‌పై అవిశ్వాసం ఖండిస్తున్నాం ● దొడ్డి దారి రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ● మా పార్టీ కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు ● వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూటమికి సంఖ్యా బలం లేకపోయినా.. మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ దొడ్డిదారిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యని, వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, లొంగకపోతే భయపెట్టి బలవంతంగా లాక్కొంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధులు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ పనికిమాలిన రాజకీయాలంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ సీపీని అభిమానించే కార్పొరేటర్లంతా సమావేశానికి వచ్చారని.. కూటమి నేతలు ఎన్ని కుయుక్తులకు పన్నినా మేయర్ పీఠాన్ని కదపలేరన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కుళ్లు రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పాలని హితవుపలికారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచన మానుకోవాలని హితవుపలికారు. కూటమి పార్టీలకు మెజారిటీ లేకపోయినా అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారంటే.. తమ పార్టీ కార్పొరేటర్లను ఏవిధంగా భయపెడుతున్నారో.. ప్రలోభపెడుతున్నారో అర్థమవుతుందన్నారు. మేయర్ పీఠం ఎలా కాపాడుకోవాలనే దానిపై వ్యూహ రచనలు చేశామని, తప్పనిసరిగా కాపాడే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment