అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ అట్టర్ ప్లాప్‌గా మారింది. ఆ పార్టీ నాయకులతో పాటు జనం నుంచి కూడా స్పందన లేకపోవడంతో టీడీపీ భవిష్యత్‌కే గ్యారెంటీ లేదని ప్రజలు అంటున్నారు.
గార్లదిన్నె మండల పరిధిలోని ఇల్లూరులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బండారు శ్రావణితో పాటు ఆమె వర్గం నాయకులు, కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో టీడీపీకి భవిష్యత్తు ఏది అని బహిరంగంగానే ప్రజలు గుసగుసలాడుకున్నారు.
అడుగడుగునా అవమానాలే..... బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..?
టీడీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయట పడింది. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినప్పటికీ టీడీపీలో అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రావణి గైర్హాజరైనట్లు సమాచారం. బస్సు యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎక్కడా శ్రావణి ఫొటో లేకపోవడం గమనార్హం. అలాగే కల్లూరు వైఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా జనం లేక వెలవెలబోయింది.
పేరుకే బండారు శ్రావణి..
శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఎప్పట్నుంచో టీడీపీకి సేవలందిస్తోంది. కానీ ఈమెకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలోనే శ్రావణి తండ్రిపై ఇతర సామాజికవర్గ పెద్దలు దాడి చేశారు. గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయినా లోకేష్ దీనిపై స్పందించలేదు. అంతేకాదు నియోజకవర్గంలో పేరుకే శ్రావణి.. పెత్తనమంతా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి చేతుల్లోనే ఉండటంతో ఎస్సీలు రగిలిపోతున్నారు.
చికెన్, మందు ఏర్పాటు చేసినా...
షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే జనం రాకపోవడంతో ఆలస్యంగా మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమైంది. టీడీపీ నాయకులు బస్సుయాత్రకు వాహనాలు సమకూర్చిన జనం రాకపోవడంతో బస్సుయాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారింది. టీడీపీ నాయకులు నామమాత్రంగానే కార్యక్రమాన్ని జరిపించి మమ అనిపించారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు చికెన్, మందు ఏర్పాటు చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment