నివేశన స్థలాల కోసం అనేక ఏళ్లుగా నిరీక్షిస్తున్న పేదలకు జగన్ సర్కార్ ఊరట కలిగించింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను క్లియరెన్స్ చేసి పట్టాలు మంజూరు చేసింది. వారి సొంతింటి కల సాకారానికి బాటలు వేసింది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన మోసంతో ఆశలు వదులుకున్న పేదలు ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో న్యాయం జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఉరవకొండ: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఓట్ల కోసం గిమ్మిక్కులు చేశారు. ఏకంగా 15 సర్వే నంబర్లు పొందుపరచి.. హద్దులు పేర్కొనకుండానే తయారు చేసిన ఇంటి పట్టాలను ఉరవకొండలో పేదలకు పంపిణీ చేశారు. పేదలకు పట్టాలు తన ఘనతేనంటూ పయ్యావుల కేశవ్ పబ్లిసిటీ చేసుకున్నారు.
కానీ అస్పష్టంగా ఉన్న ఆ పట్టాలన్నీ చెల్లవని తేలింది. తాము నిలువునా మోసపోయామని బాధితులు లబోదిబోమన్నారు. ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పేదల ఇంటి పట్టాల సమస్యను పట్టించుకోలేదు.
విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు, టీవీ చానెళ్లు, సోషల్ మీడియాకు పరిమితమయ్యారు. పైగా నియోజకవర్గ టీడీపీ నేతలు పేదలకు స్థలాలు అందకూడదనే ఉద్దేశంతో సదరు సర్వే నంబర్ల భూయజమానులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచాలంటూ కోర్టులో కేసులు వేయించారు.
జగన్ సర్కారు చొరవ..
ఉరవకొండలోని పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు వైఎస్సార్‌సీపీ సర్కారు చొరవ తీసుకుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హత కల్గిన వారందరికీ స్థలాల కేటాయింపునకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవతో ఉరవకొండ పట్టణంలో ఏకంగా 3,500 మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరయ్యాయి.
ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఏళ్లుగా ఉన్న భూవివాదం హైకోర్టులో పరిష్కారమయ్యేలా శ్రద్ధ చూపడంతో తొలి విడతగా 560 ఇంటిపట్టాలను వై.విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఇటీవలే పంపిణీ చేశారు. స్థలాలను కూడా చూపించారు.
మిగిలిన వారికి కూడా పట్టాలు సిద్ధం చేశారు. వారికి త్వరలోనే అందించనున్నారు. నాడు ఎమ్మెల్యే కేశవ్ దొంగపట్టాలతో తమను మోసం చేస్తే.. నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా పట్టాలు మంజూరు చేయించారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మేలు చేసిన వారిని మరువం
గతంలో ఓట్ల కోసం బోగస్ పట్టాలు పంపిణీ చేసి మోసం చేశారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలిచిన తర్వాత కూడా పట్టాల గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మా పక్షాన నిలబడ్డారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం హామీ పత్రాలు అందించి.. కోర్టు వివాదం పరిష్కరించి ఇంటి స్థలం చూపించారు. మేలు చేసిన వారిని ఎన్నటికీ మరచిపోము. – షాకీరా, లబ్ధిదారు, ఉరవకొండ
సంతోషంగా ఉంది
నాడు 15 సర్వే నంబర్లతో ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అయితే అందులో హద్దులు చూపకుండా నిలువునా మోసం చేసింది. జనంతో మమేకమయ్యే విశ్వ అన్న సీఎం జగనన్నతో మాట్లాడి మాకు సమగ్ర వివరాలతో కూడిన పట్టా ఇప్పించి, పక్కాగృహం మంజూరు చేయించారు. చాలా సంతోషంగా ఉంది. – ఈశ్వరమ్మ, రంగావీధి, ఉరవకొండ
రుణపడి ఉంటాం
15 ఏళ్లుగా బాడుగ ఇంట్లో ఉంటూ అవస్థలు పడ్డాం. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలు జగన్ ప్రభుత్వంలో విశ్వ అన్న కృషితో పరిష్కారం అయ్యాయి. నాకు పట్టా ఇచ్చి పక్కా ఇల్లు కూడా మంజురు చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – కురసాల లావణ్య, చౌడేశ్వరి కాలనీ, ఉరవకొండ
పేదల కళ్లల్లో ఆనందం కన్పిస్తోంది
ఎమ్మెల్యే కేశవ్ అప్పట్లో ఓట్ల కోసం చెల్లని పట్టాలు ఇచ్చి ప్రజలను మోసగించాడు. అప్పట్లోనే నేను పేదల ఇంటి పట్టాల కోసం భారీ స్థాయిలో ఉద్యమించాను. రోడ్ల దిగ్బంధం, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టి అరెస్టయ్యాం.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో రికార్డు స్థాయిలో ఉరవకొండ పట్టణానికి 3,500 పట్టాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల పక్కా ఇళ్లు మంజూరు చేయించాం. సొంతింటి కల సాకారమవుతున్న వేళ పేదల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నాకు ఎంతో తృప్తినిస్తోంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఉరవకొండ
రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం..
పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయించాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఆయన కృషితో జిల్లాలోనే రికార్డుస్థాయిలో ఉరవకొండ నియోజకవర్గానికి 21 వేల పక్కా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment