అనంతపురం కల్చరల్: శుభముహూర్తాల మాసం మాఘం రానే వచ్చింది. శుక్రవారం అమావాస్యతో పుష్యమాసం ముగిసి శనివారం నుంచి మాఘం ప్రారంభం కానుంది. పరిణయ ముహూర్తాలను వెంటబెట్టుకొస్తున్న ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా వందలాది జంటలు ఏకం కానున్నాయి. ఇంటింటా బాజా భజంత్రీలు, మంగళవాయిద్యాలు మార్మోగనున్నాయి. పెళ్లిల్లే కాకుండా గృహప్రవేశాలు, నామకరణోత్సవాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు కూడా మాఘంలో ఎక్కువగా జరుగుతాయి. అయితే రెండు నెలల తర్వాత పవిత్ర శ్రావణమాసం సహా మళ్లీ ఆరు నెలల పాటు శుభ ముహూర్తాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బుకింగ్‌లతో కళకళలాడుతున్నాయి.
పండుగలు కూడా అధికమే
ఈ నెల 10 నుంచి మార్చి 9 వరకు ఉండే మాఘ మాసంలో శుభముహూర్తాలతో పాటు పండుగలు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా మాఘ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తే విశేష పుణ్యఫలమని అందరూ భావిస్తారు. ఈ మాసంలో జాతర్లు, తిరునాళ్లు వస్తాయి. బుక్కరాయసముద్రం కొండమీది రాయుడు తిరునాళ్ల, బొలికొండ రంగనాథుని జాతర, తడకలేరు తేరు వంటివి ఈ నెలలోనే జరుగుతాయి. మాసం చివరి రోజున వచ్చే మహాశివరాత్రి మాఘమాసానికే ఆధ్యాత్మిక శోభ తెస్తుంది. అలాగే 14న రానున్న వసంత పంచమి అక్షరాభ్యాసాలకు నెలవుగా ఉంటుంది. 16వ తేదీన ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవర రథసప్తమి, వాసవీమాత ఆత్మార్పణదినం, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతి, రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి, మార్కండేయ జయంతి పర్వదినాలు అందరిలోనూ భక్తిభావాన్ని తెస్తాయి.
విశేష ప్రాముఖ్యత కలిగిన మాసం
సాధారణంగా హైందవ జీవితంలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేకత ఉన్నట్టే మాఘ మాసానికి విశేష ప్రాముఖ్యత కనపడుతుంది. సూర్యభగవానుడు ఉదయించక మునుపే స్నానమాచరించడం సైన్సు పరంగా కూడా ఎంతో మంచిది. ఈ నెల 11, 14, 18, 28, 29 తేదీల్లో విశేషమైన ముహూర్తాలున్నాయి. అలాగే జాతర్లు, తిరునాళ్లు ఏర్పాటు చేయడం కూడా అందరిలో ఐకమత్యం, మానసిక ప్రశాంతత పెంచడం కోసమే.
– రాఘవేంద్ర ప్రసాద్ శర్మ, పురోహితులు, గీతామందిరం, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment