
అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్
ఓటు హక్కు లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు
ఓటుకు ఫోన్ నంబర్ అనుసంధానం
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో ప్రతి పౌరుడూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఓటరు జాబితాలో తన పేరు ఉన్నదో? లేదో? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న భారత ఎన్నికల కమిషన్... జాబితాలో ఓటు వివరాలు తెలుసుకునే సదవకాశాన్ని కల్పించింది. జాబితాలో ఓటు లేదని గుర్తిస్తే వెంటనే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్తగా ఓటరు నమోదుకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసే ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అనుబంధ జాబితాలో చేరుస్తారు.
అందుబాటులో ఓటర్ హెల్ప్‌లైన్..
● ఓటరు జాబితాలను పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ), తహసీల్దారు కార్యాలయంలో ఇప్పటికే అధికారులు అందుబాటులో ఉంచారు. ఆయా అధికారిక కార్యాలయాలకు వెళ్లి జాబితాను పరిశీలించి ఓటు హక్కు ఉందో... లేదో నిర్ధారించుకోవచ్చు. అలా కాకపోతే ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశాన్ని కూడా భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
● స్మార్ట్‌ఫోన్లలో ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ఆప్షన్లు వస్తాయి. ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై’ కింద వచ్చిన ఆప్షన్లలో ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు.
● కంప్యూటర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే వారు https:// electoralsearch.eci. gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, ఓటర్ ఐడీ నంబర్, స్టేట్ అనే చోట ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్‌ను క్లికి చేయగానే ఓటు వివరాలు కనిపిస్తాయి.
● ఓటు వివరాలు తెలుసుకునేందుకు 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఓటర్ ఐడీ నంబర్ చెబితే... అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌లో పరిశీలించి ఓటు ఉందా లేదా అనే విషయం చెబుతారు.
ఓటు లేకపోతే నమోదు చేసుకోవాలి..
ఓటు లేదని తెలిస్తే వెంటనే ఓటరుగా నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్‌ఓ, తహసీల్దారు కార్యాలయంలో మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది.
ఫోన్ నంబర్‌తో అనుసంధానం ఇలా...
ఓటును మీ మొబైల్ ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైనా మీ ఓటును సవరించాలనో, తొలగించాలనో చూస్తే వెంటనే అనుసంధానం చేసుకున్న నంబర్‌కు సంక్షిప్త సమాచారం అందుతుంది. ఈ సౌలభ్యం పొందేందుకు వెబ్‌లింక్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. http:// ceoaperms.ap.gov.in/ AP&MobileNoRegistration/MobileNo Registration.aspx లింక్‌ను తెరిచి, ఇందులో ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. దాని కిందనే ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడీకి ఫోన్ నంబర్ అనుసంధానమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment