అనంతపురం: సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను పెంచేలా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ చేపట్టింది. ఈవీఎంల ద్వారా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడం పరిపాటి. అయితే ఈ పద్ధతిలో కాకుండా మరిన్ని పద్ధతుల్లోనూ ఓటు వేసే వారు ఉన్నారు. అవేమిటో తెలుసుకుందాం రండి...
● టెండర్ ఓటు..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఓటరు ఓటు వేయకపోయినా వేసినట్లుగా నమోదై ఉంటుంది. అ సమయంలో సదరు ఓటరు తాను ఓటు వేసి తీరుతానని పట్టుబడుతాడు. దీంతో ఆ ఓటరు వివరాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలించి.. వాస్తవంగా ఓటు ఆయన వేయలేదని నిర్ధారణకు వస్తే ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపరుపై ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. దీనినే టెండర్ ఓటు అంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించి 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు. ఓటు వేశాక బ్యాలెట్ పేపర్‌ను కవర్లలో పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తే దాని వెనుక టెండర్ బ్యాలెట్ అని రాస్తారు.
● ప్రాక్సీ ఓటు..
కేంద్ర నిఘా సంస్థలు, గూఢచారి సంస్థల సిబ్బంది తమ ఉనికి మరెవరికి తెలియకుండా గోప్యంగా ఉంటారు. వారు తమ ప్రతినిధిగా మరెవరినైనా పంపి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఈ విధమైన ఓటు హక్కునే ప్రాక్సీ ఓటు అంటారు. వారు స్థానికంగా లేనందున ఓటు వేసేందుకు ఒక ప్రతినిధిని అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ సర్వీస్ ఓటరుగా పరిగణిస్తారు. నియోజకవర్గం, పోలింగ్ బూత్ పరిధిలోని ఫ్రాక్సీ ఓటరు వివరాలపై ఆర్‌ఓ ద్వారా ప్రొసీడింగ్ అధికారికి ముందే సమాచారం అందుతుంది. సర్వీసు ఓటరు తరఫున వచ్చే సదరు ఓటరు ఆ పోలింగ్ కేంద్రంలో సాధారణ ఓటరుగానే ఓటు వేస్తారు. ఇలాంటి ఓటరుకు మధ్య వేలికి సిరా చుక్క పెడతారు. అదే సర్వీసు ఓటరుకు అయితే కుడి చేతికి సిరా చుక్క పెడతారు. అయితే ప్రాక్సీ ఓటరు ఒకరి తరపున మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది.
● సర్వీస్ ఓటు..
దేశ రక్షణలో భాంగా చాలా మంది సైనికులు, పారా మిలటరీ ఉద్యోగులు స్వరాష్ట్రానికి వెళ్లి తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోలేరు. తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం వీరికి వెసులుబాటు కల్పించింది. వీరిని సర్వీస్ ఓటర్లుగా గుర్తిస్తారు. ఆసక్తి ఉన్న వారు కోరుకుంటే వీరి కోసం ప్రత్యేకంగా సర్వీసు ఓటును కల్పిస్తుంది. వీరు సర్వీస్‌లో ఉన్న ప్రాంతం నుంచే ఓటు వేయవచ్చు.
● సాధారణ ఓటు..
భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించింది. ఇలా ఓటు హక్కు పొందిన వారు తమకు నచ్చిన నేతకు ఓటు వేయవచ్చు. తమ గ్రామాల్లో బూత్‌కు వెళ్లి మామూలుగా ఓటు వస్తే దానిని సాధారణ ఓటు అంటారు.
Comments
Please login to add a commentAdd a comment