వాహనం ఢీ... యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

వాహనం ఢీ... యువకుడి మృతి

Published Fri, May 24 2024 1:45 AM

వాహనం ఢీ...  యువకుడి మృతి

ఆత్మకూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.... ఆత్మకూరు మండలం తలుపూరుకు చెందిన చంద్రమోహన్‌ (28)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్లుగా గుంతకల్లులో వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేసే పనితో జీవనం సాగిస్తున్న ఆయన ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం రాత్రి ఆత్మకూరులో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తలుపూరుకు బయలుదేరాడు. వడ్డుపల్లి అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి టోల్‌ప్లాజా వద్ద ఉన్న అంబులెన్స్‌ ద్వారా క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

గుంతకల్లుటౌన్‌: స్థానిక హంపయ్య కాలనీకి చెందిన షేక్‌ అమీనాబేగం ఇంట్లో చోరీ జరిగింది. నకిలీ తాళం చెవిని వినియోగించి దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగులగొట్టి అందులో భద్రపరిచిన 2.5 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి సామగ్రి, కొంత నగదు అపహరించుకెళ్లారు. బుధవారం రాత్రి అమీనాబీ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి స్థానిక మస్తాన్‌వలి దర్గాలో నిద్ర చేయడానికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయాన్నే ఇంటికి చేరుకుని చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తుచేపట్టినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement