తలసేమియాతో బాధపడుతున్న విద్యార్థి
శస్త్రచికిత్సకు రూ.18 లక్షలు అవసరమన్న వైద్య నిపుణులు
చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న తల్లిదండ్రులు
మందుల కొనుగోలుకూ తప్పని ఇబ్బంది
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
గార్లదిన్నె: తన ఈడు పిల్లలతో కలసి బడికెళ్లాల్సిన ఓ చిన్నారి తలసేమియా వ్యాధి బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు. ‘అమ్మా... ఈ ఆస్పత్రి వద్దు.. నేనూ బడికి పోతా’నంటూ ఆ చిన్నారి అమాయకంగా అడుగుతుంటే నిరుపేద తల్లిదండ్రుల కంట నీరు ఆగడం లేదు. చాపకింద నీరులా కబళిస్తున్న మృత్యువు బారి నుంచి తమ బిడ్డను దక్కించుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు పడుతున్న వేదన మాటల్లో వర్ణించలేం. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
కూలికెళితేనే పూట గడుస్తుంది..
గార్లదిన్నె మండలం పాత కల్లూరులో నివాసముంటున్న సురేంద్ర, సుజాత దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆదాయం అరకొరగా ఉన్నా... ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు శ్రీకాంత్ అరుదైన వ్యాధిబారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు.
15 రోజులకోసారి రక్తమార్పిడి
ఏడేళ్ల వయసున్న శ్రీకాంత్... నెల రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో సమీపంలోని పామిడిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరో ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిలో ఎర్ర రక్తకణాలు క్షీణిస్తున్న విషయాన్ని పసిగట్టిన సదరు వైద్యుడి సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు వెంటనే రక్తం ఎక్కించారు.
అయినా మార్పు కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని హయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు... హైదరాబాద్ లేదా బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తలసేమియా వ్యాధితో శ్రీకాంత్ బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేసే వరకూ ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. దీంతో కుమారుడి వద్ద తన భార్యను ఉంచి సురేంద్ర స్వగ్రామానికి చేరుకున్నాడు.
కుటుంబపోషణ కోసం తన వద్ద ఉన్న రెండు గేదెలు అమ్మడంతో పాటు ఇతరుల వద్ద అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని బెంగళూరుకు వెళ్లాడు. ఇప్పటి వరకూ వైద్యం కోసం దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇన్‌పేషెంట్‌గా ఉంటే ఆస్పత్రి ఖర్చులు భరించలేని దుస్థితికి చేరుకోవడంతో అదే ఆస్పత్రి బయట ఓ గదిని అద్దెకు తీసుకుని రోజూ వెళ్లి చికిత్స చేయించుకుని వస్తున్నారు. ఈ క్రమంలో సురేంద్ర అక్కడే కూలి పనులకు వెళుతుండగా.... తల్లి సుజాత కుమారుడి బాగోగులు చూసుకుంటోంది.
బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి ...
రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్న కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు నిరుపేద తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారీ రూ.20 వేలు ఖర్చు వస్తోంది. ప్రస్తుతం చేతిలో నయా పైసా లేదు. బెంగళూరులోనే సురేంద్ర కూలీ పనుల ద్వారా సంపాదిస్తున్న అరకొర డబ్బు రోజు వారి అవసరాలకు సరిపోతోంది. స్వశక్తితో కుమారుడికి నయం చేయించుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్థితిలో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు.
బ్యాంక్ వివరాలు...
ఖాతాదారు పేరు : కె.సుజాత
బ్యాంక్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కల్లూరు శాఖ, గార్లదిన్నె మండలం
ఖాతా నంబర్ : 3879 010 6265
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఎస్‌బీఐఎన్0002737
ఫోన్‌పే నంబర్లు : 90145 15056,
81067 51483
Comments
Please login to add a commentAdd a comment