జవాబు పత్రాలకు రెక్కలు!
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగం అధికారుల అలసత్వం మరోసారి బయట పడింది. ఈ సారి ఏకంగా విద్యార్థుల జవాబు పత్రాలు గల్లంతు కావడం దుమారం రేపింది. నెల రోజుల క్రితమే ఈ విషయం బయటపడినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం గమనార్హం. తమ భవిష్యత్తును నిర్దేశించే జవాబు పత్రాలు కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
గత నెలలో పరీక్ష..
చిత్తూరు జిల్లాలోని జేఎన్‌టీయూ అనుబంధ ‘వేము ఇంజినీరింగ్ కళాశాల’లో డిసెంబర్ 10న ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థులకు కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్ సబ్జెక్టు పరీక్ష(ఆర్–20 రెగ్యులర్) నిర్వహించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను వేము కళాశాల నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగానికి పంపారు. ఈ మేరకు రిజిస్టర్ పోస్టులోనూ నమోదు చేశారు. జవాబు పత్రాలు వచ్చినట్లు జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగంలోనూ నమోదైంది. ఇంత వరకూ బాగానే ఉన్నా పరీక్షల విభాగంలో ఆ తర్వాత జవాబు పత్రాలు కనిపించకుండా పోవడం ఆందోళన రేపింది. విభాగంలో అణువణువూ సిబ్బంది జల్లెడ పట్టినా వాటి జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైనట్లయింది. పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యం తలెత్తింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా..
నెల రోజుల క్రితమే విషయం బయటపడినా.. వర్సిటీ ఉన్నతాధికారులకు తెలియజేయకుండా తొక్కిపెట్టాలని ప్రయత్నం చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. చివరికి చేసేది లేక వారి దృష్టికి తీసుకెళ్లి.. విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
పరిశీలించాలని చెప్పాం
జవాబు పత్రాల గల్లంతు వ్యవహారం రెండు రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించాలని ఆదేశించాం. పోస్టాఫీసులో మరో దఫా సంప్రదించాలని కోరాం. జవాబు పత్రాల బండిల్ ఇచ్చారా.. లేదా అని ఆరా తీస్తున్నాం.
– ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు,
ఇన్‌చార్జ్ వీసీ, జేఎన్‌టీయూ (ఏ)
Comments
Please login to add a commentAdd a comment