5 నుంచి కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు
బుక్కరాయసముద్రం: మండలంలో కొలువైన కొండమీదరాయ స్వామి ఉత్సవాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండపై కొండమీదరాయ స్వామి ఆలయం ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూ. 4 కోట్లు వెచ్చించి కొండపైకి మెట్ల మార్గంతోపాటు సిమెంట్ రోడ్డు వేశారు. ఇరువైపులా హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించారు.
10 రోజులు ఉత్సవాలు..
కొండమీద రాయుని బ్రహ్మోత్సవాలు 10 రోజులు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న సాయంత్రం బుక్కరాయసముద్రంలోని లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను కొండపైకి తీసుకెళ్తారు. 6న ఉదయం 8 గంటలకు దేవర కొండపై పుణ్యాహవాచనము, దేవతా హోమం, ధ్వజా రోహణము, గరుడ ఆహ్వాన పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ ఉంటుంది. 7న స్వామి వారిని సింహ వాహనంపై మండల కేంద్రంలో ఊరేగిస్తారు. 8న శేష వాహన, 9న హనుమద్వాహన, 10న గరుడ, 11న శ్వేత గజ వాహన సేవలు నిర్వహిస్తారు.
12న
రథోత్సవం
కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలైన కల్యాణ, రథోత్సవాలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి. ఆ రోజు వేకువజామున స్వామి వారికి కల్యాణ మహోత్సవం ఉంటుంది. ఉదయం 11.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై గరుడాద్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నారాయణస్వామి దేవాలయం నుంచి పురవీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం మండల కేంద్రంలో రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఇక.. 13న రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, 14న ఉదయం 7 గంటలకు తీర్థవాది వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment