విద్యావ్యతిరేక విధానాలపై పోరుబాట
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యా వ్యతిరేక విధానాలు అవంభిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా ఉన్న కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరుబాట పడతామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు హెచ్చరించారు. బుధవారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రాయల్ వెంకటేష్, ఎస్.సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి.నరసింహులు మాట్లాడారు. 117 జీఓ రద్దు స్థానంలో ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన 117 జీఓను రద్దు చేస్తామని విపక్షంలో ప్రకటించిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత జీఓ రద్దు మాట మరిచి, ప్రత్యామ్నాయ మార్గదర్శకాలంటూ విపరీత పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో విద్యారంగానికి భారీ నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుదూరప్రాంతాల్లో ఉండే ఆదర్శ ప్రైమరీ పాఠశాలలకు 3, 4, 5 తరగతుల పిల్లలు వెళ్లలేక డ్రాపౌట్స్‌గా మారే ప్రమాదముందన్నారు. దీంతో పాఠశాల విద్య మరింత నిర్వీర్యమవుతుందన్నారు. జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన తల్లిదండ్రుల వెంట విధిలేని పరిస్థితుల్లో పిల్లలు కూడా వెళ్లి ఉంటారన్నారు. అలాంటి పిల్లల పేర్లను మూకుమ్మడిగా పాఠశాలల రికార్డుల నుంచి తొలిగించడం సరైన విధానం కాదన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్, నరేష్కుమార్, రాష్ట్రకార్యవర్గ సభ్యులు సర్దార్‌వలి, నాయకలు వెంకటరమణ, రామ్మూర్తి, వన్నప్ప పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
Comments
Please login to add a commentAdd a comment