డీజిల్ అపహరణ
గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి శివారున 44వ జాతీయ రహదారి పక్కన ఆపిన రెండు లారీల నుంచి 800 లీటర్ల డీజిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం వేకువజామున అపహరించారు. దీంతో లారీలు అక్కడే ఆగిపోయాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు లోడుతో బయలుదేరిన లారీ డ్రైవర్లు నిద్ర ముంచుకు రావడంతో బాచుపల్లి శివారున రోడ్డు పక్కన పెట్రోల్ బంక్ వద్ద ఆపి నిద్రించారు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి డీజిల్ ట్యాంకులకు ఉన్న మూతలు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి పరిశీలిస్తే ట్యాంకులు ఖాళీగా కనిపించాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రెండు లారీల్లో రూ.78 వేలు విలువ చేసే 800 లీటర్ల డీజిల్ అపహరించినట్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చీటింగ్ కేసు నమోదు
ఉరవకొండ: బ్యాంక్‌లో ఉద్యోగమంటూ ఓ మహిళను మోసగించి నగదు దండుకున్న అంశానికి సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను ఉరవకొండ ఎస్ఐ జనార్దననాయుడు బుధవారం వెల్లడించారు. ఉరవకొండడలోని ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళకు హైదరాబాద్‌కు చెందిన అక్షయ్నందన్ అనే వ్యక్తి ఫోన్ చేసి బ్యాంక్‌లో ఉద్యోగం కల్పిస్తున్నట్లు నమ్మబలికాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా రూ.23 లక్షల వరకూ నగదును తన ఖాతాకు బదిలీ చేయించుకుని, ఆ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్దారించుకున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్షయనందన్పై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే విశ్రాంత
ఉద్యోగి బలవన్మరణం
గుంతకల్లుటౌన్: స్థానిక భాగ్యనగర్ గంటచర్చి ప్రాంతంలో నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి నోయల్ ల్యాంబ్(35) ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు 9 ఏళ్ల క్రితం రైల్వే ఉద్యోగిగా ఉన్న సమయంలో నోయల్‌కు వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా మొదట్లోనే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన ఆయన విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో విధుల నుంచి అధికారులు తొలగించారు. అయినా ఆయన తీరు మారకపోవడంతో కుటుంబసభ్యులు విసుగు చెంది హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో అనారోగ్యంతో పాటు ఒంటరి జీవితాన్ని తాళలేక బుదవారం ఉదయం తన ఇంట్లోనే పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment