
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీటీఆర్‌ఐ) ద్వారా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ గురువారం తెలిపారు. ఎఫ్‌సీఆర్–15 (సీటీఆర్‌ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది అధిక దిగుబడిని (హెక్టార్‌కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకమన్నారు.
ఎఫ్‌సీజే–11 (సీటీఆర్‌ఐ నవీన) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకమన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 2,900 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ (ఎస్‌వీఆర్‌సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్‌లో సీటీఆర్‌ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment