జన్మదినం రోజే మృతి చెందిన కుమారుడు
గుండెలవిసేలా విలపించిన తల్లిదండ్రులు
ఉరవకొండ: ‘ఆజీం లే నాన్నా.. ఈ రోజు నీ పుట్టిన రోజు.. కొత్త బట్టలు తెచ్చాం. నీ స్నేహితులు, టీచర్లకు చాక్లెట్లు పంచిపెట్టాలి’ అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. పుట్టిన దినం రోజే ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉరవకొండ పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక పాత మార్కెట్ సమీపంలో చాపదేవుని గుడి వద్ద నివాసముంటున్న అయ్యర్ బాబా ఫకృద్దీన్ ఉరవకొండ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈయనకు భార్య హుమేరా ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆజీంబాషా (14) సంతానం. బాలుడు ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఉరవకొండలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలోనే రక్త కణాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అత్యవసరంగా అనంతపురంలోని కార్పొరేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక బుధవారం ఉదయం అజీంబాషా కన్నుమూశాడు.
శోకసంద్రం.. : బుధవారం అజీంబాషా జన్మదినం. కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఇప్పటికే తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కుమా రుడికి కొత్త దుస్తులు కూడా తెచ్చారు. సంతోషంగా ఉన్న సమయంలో ఆజీంబాషా మృతితో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఎంతో ఉల్లాసంగా, అందరితో కలివిడిగా ఉండే ఆజీంబాషా మృతితో పాత మార్కెట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్‌ఐ గురికాల శివ, కానిస్టేబుళ్లు కులశేఖర్‌రెడ్డి, ఓబుళేసు తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment