
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు.
దేశంలోనే తొలి రాష్ట్రం
కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చి పేదలందరికీ ఉచిత వైద్యం అందించిన తొలి రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకు ఈ పథకం కింద వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఉచితంగా చికిత్స పొందినవారి సంఖ్య లక్ష దాటింది.
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
సీఎం సమర్థ పాలనకు నిదర్శనం
ఆరోగ్యశ్రీ పథకంలోకి కోవిడ్‌ను చేర్చడం వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో లక్ష మందికిపైగా ఉచిత వైద్య సేవలు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ పరిపాలన, సంక్షేమ పథకాల అమలుకు ఇది ఒక నిదర్శనం.
– పరిమళ్ నత్వానీ, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు