సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఆలస్యంగా తెరుచుకున్న పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరవగా బుధవారం నాటికి ఒక్క కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 100 శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయన్నారు. 1,11,177 మంది ఉపాధ్యాయులకుగాను 99,062 మంది పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు 2వ తేదీన 42 శాతం 3న 33.69 శాతం, 4న 40.30 శాతం మంది హాజరయ్యారు.
కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయని, గతంలోనే వారికి వైరస్ సోకినా తెలుసుకోకపోవటం వల్ల పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయని వివరించారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్టులు చేస్తున్నామన్నారు. కోవిడ్‌పై అవగాహనకు ప్రతిజ్ఞ చేయించడం, శానిటైజేషన్, మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
నాడు–నేడు పనుల్లో జాప్యం సహించేది లేదు
నాడు–నేడు పనుల్లో జాప్యం సహించేది లేదని, గడువులోగా నూరుశాతం పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో నాడు–నేడు పనుల ప్రగతిపై మంత్రి సమీక్షించారు. సామగ్రి సరఫరా చేయని కంపెనీల అగ్రిమెంట్లు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సివిల్ పనుల్లో దాదాపు పూర్తి అయినప్పటికీ సామగ్రి సరఫరాలో జాప్యం జరుగుతోందని, వాష్ బేసిన్లు, మరుగుదొడ్ల సామగ్రి, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్ ఏర్పాటులో పురోగతి లోపించిందన్నారు. 100 శాతం సామగ్రి పాఠశాలలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.
పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థుల ఆసక్తి
Published Thu, Nov 5 2020 5:02 AM | Last Updated on Thu, Nov 5 2020 5:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment