సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్ ఫలితాల కోసం త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలని సూచించారు. పాఠశాలలు తెరిచే అంశంపై లోతుగా పరిశీలన చేయాలని ఆదేశించారు. 2021–22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేయాలని, పరిస్థితులను అనుసరించి తరగతుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు తరగతుల నిర్వహణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.
‘సాల్ట్’ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన’(సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్–సాల్ట్)’ అనే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఐదేళ్ల(2021–22 నుంచి) కాలపరిమితి కలిగిన ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.1,860 కోట్లు) ఆర్థిక సహాయంగా అందిస్తోందని తెలిపారు. ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును.. నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారిని, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఫిజికల్లీ చాలెంజ్డ్(దివ్యాంగ) పిల్లల కోసం ఏర్పాటైన వైఎస్సార్ విజేత స్కూల్ తరహాలో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ప్రాజెక్టు ఉద్దేశాలు..
సాల్ట్ పథకం ద్వారా బేస్‌మెంట్ లెర్నింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు టీచర్లు, విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరుస్తామని మంత్రి సురేష్ చెప్పారు. అలాగే శిశు సంరక్షణ విద్యను పాఠశాలకు అనుసంధానించడం.. అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ, ఆటపాటల ఆధారిత టీచింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ పథకంలో భాగమన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ‘నాడు–నేడు’ పనులు పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం వనరుల కేంద్రాలను మెరుగుపరచడం, తల్లిదండ్రుల కమిటీలతో స్కూళ్లలో సామాజిక తనిఖీ తదితర కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించగలుగుతామని మంత్రి చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు(ఇన్ ఫ్రా) ఎ.మురళి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య పాల్గొన్నారు.
వారంలో టెన్త్, ఇంటర్ ఫలితాలివ్వాలి
Published Sun, Jun 27 2021 4:24 AM | Last Updated on Sun, Jun 27 2021 4:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment