
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఈ వర్గాలకు పెద్ద పీట వేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తాజాగా చేసిన భూ కేటాయింపుల్లోనూ వీరికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 195 పరిశ్రమలకు 467.13 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పరిశ్రమల్లో 57 శాతం అంటే 111 యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవే. అందులో అత్యధికంగా మహిళల యూనిట్లే ఉన్నాయి. 54 యూనిట్లు ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఏర్పాటు చేస్తుండగా, ఎస్టీలు 15, బీసీలు 42 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 195 యూనిట్లు ద్వారా రూ.5,153.43 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 10,219 మందికి ఉపాధి లభిస్తుంది.
రెండు సెంట్ల భూమి నుంచి రెండు ఎకరాల లోపు భూమిలో చిన్న పెట్టుబడులతో బడుగు, బలహీన వర్గాలు ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో ఆటోమొబైల్ వెల్డింగ్స్, పేపర్ ప్లేట్స్, బొమ్మల తయారీ, రెడీమేడ్ గార్మెంట్స్, వుడ్ కారి్వంగ్, కుట్టు మిషన్ల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి.
జనరల్ కేటగిరీ విభాగంలో పెద్ద పరిశ్రమలు
జనరల్ కేటగిరీ విభాగంలో జరిగిన భూ కేటాయింపుల్లో అత్యధికంగా భారీ పరిశ్రమలు ఉన్నాయి. హెల్లా ఇన్‌ఫ్రా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో రూ.260.70 కోట్లతో పీవీసీ పైపుల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమకు 26.75 ఎకరాలు కేటాయించారు. ఏఐఎల్ డిక్సన్ కొప్పర్తి ఈఎంసీలో 0.46 ఎకరాల్లో రూ.105.26 కోట్లతో డిజిటల్ వీడియో రికార్డులు, కెమెరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది.
గ్రేస్ వెంచర్స్ రూ.520 కోట్లతో నాయుడుపేటలో బయో ఇథనాల్ యూనిట్, , ఆరోకెమ్ ఇంగ్రిడియంట్స్ రూ.320 కోట్లతో నాయుడుపేట సెజ్‌లో అరోమా ఇంగ్రిడియంట్స్ యూనిట్, ఎవరెస్ట్ స్టీల్ రూ.242.13 కోట్లతో అనంతపురంలో పీఈబీ ప్లాంట్, అబీస్ ప్రొటీన్స్ రూ.150 కోట్లతో చిత్తూరులో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, తారకేశ్వర లాజిస్టిక్ పార్క్ రూ.180 కోట్లతో విశాఖలో వేర్‌హౌసింగ్, రూ.1,771.50 కోట్లతో హిందాల్కో తిరుపతిలో అల్యూమినియం ఉత్పత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment