సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. 13 కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ వర్తిస్తుంది. కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్బన్, రూరల్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్
కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్‌వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలికింది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది.
అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది.
వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment