దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా.. | Andhra Pradesh Government efforts for industrial development in state | Sakshi
Sakshi News home page

దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా..

Published Mon, Jan 17 2022 3:12 AM | Last Updated on Mon, Jan 17 2022 8:04 AM

Andhra Pradesh Government efforts for industrial development in state - Sakshi

సాక్షి, అమరావతి: పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దిగ్గజ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన పలు భారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఆయా కంపెనీల అధినేతలు పలువురు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ప్రముఖ కంపెనీల రాక.. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన 15కిపైగా కంపెనీలు గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. రూ.లక్షల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన సన్‌ఫార్మా, ఐటీసీ, అదానీ, ఓఎన్‌జీసీ, ఆదిత్య బిర్లా గ్రూపు, అరబిందో, కాంకర్, బీఈఎల్, జిందాల్‌ స్టీల్, ఎస్సార్‌ స్టీల్, డిక్సన్, బ్లూస్టార్, సెంచరీ ఫ్లైవుడ్, శ్రీ సిమెంట్‌ లాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెడుతున్నాయి. సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వీ ముఖ్యమంత్రితో సమావేశమై రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఐటీసీ సంస్థ గుంటూరులో తొలి ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నెలకొల్పడమే కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.  మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్‌ఆర్‌ చేయూత  కార్యక్రమంలో కూడా ఐటీసీ పాలు పంచుకుంటోంది. సుమారు రూ.7.50 లక్షల కోట్ల విలువైన అదానీ గ్రూపు కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు విశాఖలో రూ.14,634 కోట్లతో 200 ఎంవీ డేటా సెంటర్, బిజినెస్‌ పార్క్, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా రూ.24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బీఈఎల్‌ లాంటి కేంద్ర సంస్థలు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో రూ.96,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 79,700 మందికి ఉపాధి లభించనుంది. ఒక్క ఓఎన్‌జీసీనే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్లు వెచ్చిస్తుండటం గమనార్హం. ఓఎన్‌జీసీ చైర్మన్‌ సుభాష్‌ కుమార్‌ గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన సంగతి తెలిసిందే. కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌పై ప్రధానంగా చర్చించారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బీఈఎల్‌ యూనిట్ల పనులు జరుగుతుండగా విశాఖలో హెచ్‌పీసీఎల్‌ రూ.17,000 కోట్ల పెట్టుబడులను పెడుతోంది.

పీఎల్‌ఐపై ప్రత్యేక దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో బ్లూస్టార్, డిక్సన్‌ లాంటి లిస్టెడ్‌ కంపెనీలను ఆకర్షించగా ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్‌టైల్‌ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులను రప్పించేలా చర్చలు జరుపుతోంది. దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేలా 13 రంగాల్లో రూ.1.97 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇచ్చేలా పీఎల్‌ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.


రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం
రాష్ట్ర సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విధానమని స్పష్టమైంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. సాంకేతికతను వినియోగించుకుని అత్యంత నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయడం ద్వారా ప్రజల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముందడుగు వేస్తున్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఏపీలో ఇంటిగ్రేటెడ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు ద్వారా ఔషధాల ఎగుమతి మా లక్ష్యం.
– సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి.

ఏపీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌తో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహం బాగుంది. త్వరలో మరో రూ.400 కోట్ల మేర ఏపీలో పెట్టుబడి పెట్టనున్నాం. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగస్వాములు కావడంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వెచ్చిస్తాం.
– గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ప్రారంభోత్సవంలో సంస్థ చైర్మన్, ఎండీ సంజీవ్‌ పూరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement