
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతీ, యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత యువతకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో దీన్‌దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ పట్టణ జీవనోపాదుల పథకం(డీఏవై–ఎన్‌యూ ఎల్‌ఎం) మార్గదర్శకాల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 35 మునిసి పాలిటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
14 రంగాలలో 28 కోర్సులు
పట్టణ ప్రాంతాల్లో ఏడో తరగతి నుంచి డిగ్రీ సమాన విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులు శిక్షణకు అర్హులు. విద్యార్హత, అభ్యర్థుల అభిరుచులకు అనుగుణంగా 14 రంగాల్లో 28 కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం అభ్యర్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ శిక్షణ కేంద్రాలతో
యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎన్‌ఎస్‌డీసీ) ద్వారా ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 69 ఉత్తమ శిక్షణ కేంద్రాలను ఎంపిక చేశారు.