సాక్షి, అమరావతి: పాడి రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. పాల కొలతల్లో మోసాలకు పాల్పడి పాడి రైతులను దగా చేస్తున్న ప్రైవేటు డెయిరీల ఏజెంట్లు, దళారులపై ఉక్కుపాదం మోపింది. వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు వసూల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను పాడి రైతులు హర్షిస్తున్నారు. మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాలను సాధారణంగా లీటర్లలో కొలుస్తారు. గ్రాముల్లో చూస్తే 970 ఎంఎల్ పాలు వెయ్యి గ్రాములు (కేజీ)తో సమానం. కానీ క్షేత్రస్థాయిలో వెయింగ్ మిషన్లలో కిలోకి 900 నుంచి 930 ఎంఎల్ మాత్రమే వచ్చేలా మారుస్తున్నారు. దీనిద్వారా రైతు నుంచి 40 నుంచి 70 ఎంఎల్ పాలను అధికంగా సేకరిస్తున్నారు. లాక్టో అనలైజర్‌పై లెక్కగట్టే కొవ్వు, ఘన పదార్థాల శాతాన్ని బట్టి మొత్తం పాలకు సొమ్ములివ్వాలి. అధికంగా సేకరించిన 70 ఎంఎల్ పాలు, దానిలో ఉండే కొవ్వు, ఘన పదార్థాలకు రైతుకు చెల్లించాల్సిన మొత్తాన్ని దళారీలు జేబులో వేసుకుంటున్నారు. పాల కేంద్రాల్లో దళారులు, ఏజెంట్లు చేసే ఈ తరహా మోసాలను ఇప్పటివరకు అడ్డుకునే వారే లేరు. వీరి ఆగడాలకు చెక్‌పెడుతూ పాడిరైతులు పైసా కూడా నష్టపోకూడదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో 27 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరి వద్దనున్న 21.47 లక్షల గేదెలు, 13.56 లక్షల ఆవుల ద్వారా ప్రతిరోజూ 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్‌కి వస్తుంటాయి. ప్రైవేటు వ్యక్తులు సైతం పెద్ద ఎత్తున పాలు సేకరిస్తుంటారు. పాల సేకరణకు నిర్దిష్ట నిబంధనలు లేవు. వాటిని కొలిచేందుకు ఉపయోగించే వెయింగ్ మిషన్, లాక్టో అనౖలైజర్‌కు లైసెన్సులు, సర్టిఫికెట్లు అవసరం. అయితే, పలు ప్రైవేటు డెయిరీల ఏజెంట్లు, దళారులు వెయింగ్ మిషన్ల సీళ్లను తొలగించి వారికి అనుకూలంగా మార్చి, రైతులను మోసం చేస్తున్నారు.
57 ఉల్లంఘనలు.. 37 మందిపై కేసులు
ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో తొలిసారిగా తూనికలు– కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను పశు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తోంది. పలు చోట్ల ప్రైవేటు డెయిరీలు, ఏజెంట్లు, దళారులు చేస్తున్న మోసాలు తనిఖీల్లో బట్టబయలవుతున్నాయి. వారిపై కేసులు నమోదు చేసి, పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేస్తున్నారు. రెండు విడతల్లో కొనసాగిన ఈ దాడుల్లో 86 బృందాలు వివిధ జిల్లాల్లో 286 చోట్ల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 57 ఉల్లంఘనలను గుర్తించారు. 37 మంది ఏజెంట్లు, దళారీలపై కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనులపై కాంపౌండ్ ఫీజు రూపంలో రూ.1,000 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలి దశలో డెయిరీల్లో జరిగే మోసాలు, కల్తీలపై ఈ బృందాలు దృష్టి పెట్టబోతున్నాయి.
లైసెన్సు లేకుండానే వినియోగం
ధర్మవరం గ్రామంలో పాలు సేకరించే ఓ ప్రైవేటు వ్యక్తి ఎలాంటి లైసెన్సు, సర్టిఫికెట్లు లేని వెయింగ్ మిషన్‌లను వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా కిలోకి 940 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు.
రోజుకు 48 లీటర్లు పక్కదారి
అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో గాయత్రి ప్రైవేటు డెయిరీకి పాలు పోస్తున్న అమ్మా డెయిరీ పాల కేంద్రంలో కిలోకి 970 ఎంఎల్ చూపించాల్సిన మిషన్‌లో 930 ఎంఎల్ చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే ఒక్కో రైతు నుంచి 40 ఎంఎల్ పాలు అధికంగా సేకరిస్తున్నారు. ఈ డెయిరీ ప్రతిరోజు 1200 లీటర్లకు పైగా పాలు సేకరిస్తుంది. ఆ లెక్కన రోజుకు కనీసం 48 లీటర్ల పాలు అధికంగా సేకరించి రైతులకు చెల్లించాల్సిన సొమ్ములను వారి జేబుల్లో వేసుకుంటున్నట్టుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment