సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): సమాజ శ్రేయస్సు కోసం రెడ్‌క్రాస్ సభ్యులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకూడదని, ఇందుకోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ వార్షిక అవార్డుల (2019–20, 2021–22 సంవత్సరాలకు) ప్రదానోత్సవం విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు మానవతా దృక్పథంతో సేవలు అందించడంలో రెడ్‌క్రాస్ ముందంజలో ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెడ్‌క్రాస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రక్తం, ఆక్సిజన్, మాస్కులు, మందులు వంటివి అందించడం ద్వారా వేల మంది రోగుల ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. రోగులకు, తలసేమియా బాధిత పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంగా రెడ్‌క్రాస్ పని చేయడం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల కలెక్టర్లు, మేనేజింగ్ కమిటీలు సేవలు అందించడం ద్వారా రెడ్‌క్రాస్ మరింత బలోపేతమైందని తెలిపారు. జిల్లా శాఖలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువకావడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిరుపేదలకు సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్‌పీ సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరంఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, పి.రంజిత్‌బాషా, శ్రీకేష్.బి.లతకర్, ఎ.సూర్యకుమారి, గుంటూరు జేసీ ఎ.దినేష్‌కుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ డాక్టర్ పి.మహేష్‌కుమార్‌తోపాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా, సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లాస్థాయిలో విస్తృతంగా సేవలు అందించిన 94 మంది నిస్వార్థ సేవకులకు అవార్డులను, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు.
‘నాటా’కు ప్రశంశలు
కోవిడ్–19 సమయంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 150 ఆక్సిజన్ సిలిండర్లను రెడ్‌క్రాస్ ద్వారా సహాయం చేసినందుకు అప్పటి నాటా అధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి గండ్ర నారాయణరెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా నాటా పీఆర్ అండ్ మీడియా కో–ఆర్డినేటర్ డీవీ కోటిరెడ్డి, ఎం.పార్థసారథిరెడ్డి, కె.సాంబశివారెడ్డికి గవర్నర్ మెడల్, అవార్డులను ప్రదానం చేశారు.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. (క్లిక్ చేయండి: ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు)
Comments
Please login to add a commentAdd a comment