సాక్షి, అమరావతి: మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం అర్హత నిబంధనలను సడలించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆ యూనిట్లు స్థాపించే వారికి బ్యాంకులు వీలైనంత త్వరగా రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన బ్యాంకర్ల ఉప కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం నిబంధనల సడలింపు, రుణాల మంజూరుకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది.
ఈ పథకం కింద ఎక్కువ మంది సాధారణ వ్యక్తులే యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకుంటారని, వారు ఐటీ చెల్లింపుదారులుగా ఉండబోరని, అందువల్ల ఐటీ రిటర్న్‌ల కోసం బ్యాంకులు ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులకు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో స్పష్టం చేశారు.
సర్టిఫికెట్ల పేరుతో ఒత్తిడి తేవద్దు
రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు 400 దరఖాస్తులు బ్యాంకులు వద్ద ఉన్నాయని, వెంటనే వాటన్నింటినీ పరిష్కరించాల్సిందిగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బ్యాంకులకు సూచించారు. లబ్ధిదారుడు ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు సాధ్యత ఉంటే వెంటనే రుణం మంజూరు చేయాలని ఏజీఎం సూచించారు. బ్యాంకు బ్రాంచీల స్థాయిలో దరఖాస్తులను తిరస్కరించవద్దని, పథకానికి సంబంధించి జిల్లా సమన్వయ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు సమయంలో మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ల పేరుతో ఒత్తిడి తేవద్దని, బ్యాంకు నిబంధనల మేరకే అవసరమైన డాక్యుమెంట్లనే తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌కు సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్, డాక్యుమెంటేషన్, బ్యాంకు రుణం పొందడంలో సహాయంతో సహా హ్యాండ్ హోల్డింగ్ మద్దతును అందించడానికి ప్రతి జిల్లాకు జిల్లా రిసోర్స్ పర్సన్లు ఉన్నారని, రుణాలు మంజూరులో వారిని భాగస్వామ్యం చేయాలని బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
18 ఏళ్లు నిండినవారు అర్హులు
కేంద్రం ఇటీవల అర్హత నిబంధనలు సడలించిన మేరకు 18 సంవత్సరాలు నిండిన వారు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అర్హులు. అలాగే 8వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను కేంద్రం తొలగించింది. విద్యార్హతతో సంబంధం లేకుండా ఈ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద వ్యక్తిగతంగా యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకునే వారికి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందించడం, ఆ యూనిట్లు సమర్థవంతంగా పనిచేసే విధంగా చేయిపట్టుకుని నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఇప్పటికే ఉన్న వ్యక్తిగత సూక్ష్మ సంస్థల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి, వ్యక్తిగతంగా కొత్త యూనిట్లు స్థాపనకు అవసరమైన మూలధన పెట్టుబడికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్‌ల విస్తరణ, అప్‌గ్రేడేషన్ లేదా కొత్త యూనిట్ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.
ప్రాజెక్ట్ వ్యయంలో లబ్ధిదారుల వాటా కనీసం 10 శాతం ఉండాలి. ఈ పథకం కింద, వ్యక్తిగతంగా యూనిట్ల స్థాపనకు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసే యూనిట్‌లకు గరిష్టంగా రూ. 10 లక్షల పరిమితితో అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35 శాతం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment