గోల్డెన్‌ చాన్స్‌! సర్కారు బడి పిల్లలకు 'గ్లోబల్‌ చదువులు' | Andhra Pradesh govt has a special focus on future technology studies | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ చాన్స్‌! సర్కారు బడి పిల్లలకు 'గ్లోబల్‌ చదువులు'

Published Mon, Jun 12 2023 3:58 AM | Last Updated on Mon, Jun 12 2023 7:48 AM

Andhra Pradesh govt has a special focus on future technology studies - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో ఇప్ప­టికే పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా­ర్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు తాజా­గా మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేసింది. భవిష్యత్‌ టెక్నాలజీ రం­గానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ పాఠ­శాలల విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ద­నుంది. వారికి హైఎండ్‌ టెక్నాలజీ రంగంలో ఉన్నతోద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఇందుకోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్‌ టెక్‌ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసింది. పాఠ్య ప్రణాళిక, ఉండాల్సిన మానవ వరులు, సదుపాయాలపై ఈ వర్కింగ్‌ గ్రూప్‌ నివేదిక ఇవ్వనుంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలతోపాటు పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాల పరంగా ఎన్నో మార్పులు తీసుకు వచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 41 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందుతున్నాయి. 

తెలుగు– ఇంగ్లిష్‌లో టెక్స్ట్ బుక్స్‌
విప్లవాత్మక నిర్ణయాలకు అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్‌ స్టడీస్, మాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో బైలింగ్వల్‌ (ఒక పేజీలో ఇంగ్లిష్, మరో పేజీలో తెలుగు) టెక్స్ట్ బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. ఇంగ్లిష్‌లో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ కూడా ఏర్పాటు చేసింది. 2021–2౨లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని, మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ పిక్టోరియల్‌ డిక్షనరీని అందించింది. 

సబ్జెక్ట్‌ టీచర్‌.. డిజటల్‌ బోధన
బోధనలో మరో కీలక మార్పు సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్‌. విద్యార్థులకు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జాతీయ.. ప్రపంచ స్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు వచ్చేలా 2022–23లో చర్యలు చేపట్టింది. విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థమయ్యేందుకు ఆడియో, విజువల్‌ రూపంలో బైజూస్‌ కంటెంట్‌ను అందించింది.

ఇందుకోసం 5,18,740 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. వీటితోపాటు డిజిటలైజేషన్‌ ప్రక్రియను విస్తృతంగా, వేగవంతంగా చేపట్టింది. నాడు–నేడు పూర్తి చేసుకున్న 30,213 హైస్కూల్‌ తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్స్‌ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం జూలై కల్లా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరో 10,038 ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో వచ్చే డిసెంబర్‌ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్‌ పరీక్షలను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

టెక్నాలజీపై సూచనలు ఇచ్చేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ 
ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలంటే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అవసరం. ప్రపంచ స్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌ టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం), ఎల్‌ఎల్‌ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్‌ చాట్‌ జీపీటీ, వెబ్‌ 3.0, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాల్టీ (వీఆర్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సెంట్ర్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ, అటానమస్‌ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై చేపట్టాల్సిన చర్యలు, మార్పులను సూచించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు.

విద్యాభ్యాసం తొలినాళ్ల నుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, లెర్నింగ్‌ కంటెంట్, ల్యాబ్‌లు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్‌ గ్రూప్‌ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు ఇలా.. 
పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఈ వర్కింగ్‌ గ్రూప్‌నకు చైర్మన్‌గా, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, స్కూలు ఎడ్యుకేషన్‌ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా నుంచి అశుతోష్‌ చద్దా, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇండియా నుంచి షాలినీ కపూర్, గూగుల్‌ సంస్థ ప్రతినిధి, ఇంటెల్‌ ఏసియా నుంచి శ్వేత ఖురానా, నాస్కాం ప్రతినిధి, సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎకానమీ పాలసీ రీసెర్చ్‌ అధ్యక్షుడు జైజిత్‌ భట్టాచార్య, నీతి ఆయోగ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ మాజీ సలహాదారు అర్చన జి.గులాటి వర్కింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15 నాటికల్లా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement