సాక్షి, కృష్ణా: "ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉంటుంది, 6వ తరగతి నుంచి పైస్థాయి వరకు ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం, విద్యా బోధనపై టీచర్లకు ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో శిక్షణ ఇస్తాం", అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల కారణంగా సీఎం ఆదేశానుసారం వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించామని తెలిపారు. అంతేకాకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామన్నారు.
ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైయ్యామని వారి సహకారంతో విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. 1.75 లక్షల మంది ఉపాద్యాయులలో 82 వేల మంది బదిలీకి ధరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని తెలిపారు. సీనియర్ హెడ్ మాస్టర్లని సెకండ్ ఎంఈఓలగా నియమించామని.. కొత్తగా 679 మంది సెకండ్ ఎంఈఓ పోస్టులని భర్తీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 355 ఎంఈఓ వన్ పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని కూడా సీనియర్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేయిస్తామని పేర్కొన్నారు. నాడు–నేడు పనులు జరుగుతున్న స్కూళ్లకు వాచ్‌మెన్ పోస్టులు ఇచ్చామని చెప్పారు. కంప్యూటర్ పోస్టుల ఫైల్ కూడా మూవ్ అవుతోందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన
3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన విధానాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి సబ్జెట్‌కు టీచర్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అంతేకాకుండా ఇంటరాక్ట్ ఫ్యానల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఎంపిక చేశామన్నారు. ఇద్దరు, ముగ్గురు ప్రొఫెసర్లను మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇప్పించామన్నారు. వారి ద్వారా టీచర్లకు ఆఫ్ లైన్, ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఆరో తరగతి పైనున్న అన్ని క్లాస్‌లకు ఇంటరాక్ట్ ఫ్యానల్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు
సుమారు 60 వేల క్లాస్ రూమ్స్‌లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లకు ఒక్కో స్కూల్‌కు ఒక్కో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 10 టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశమై ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment