Breadcrumb
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published Tue, Mar 15 2022 8:35 AM | Last Updated on Tue, Mar 15 2022 3:57 PM
Live Updates
ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. తిరిగి రేపు(బుధవారం) ప్రారంభం కానుంది.
బడ్జెట్ అద్భుతంగా ఉంది: స్పీకర్ తమ్మినేని సీతారాం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి సమతూకంలో ఉన్నాయని తెలిపారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఓ లక్ష్యంతో పని చేస్తోందని తెలిపారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం: మంత్రి బుగ్గన
బడ్జెట్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. కోవిడ్ ఉన్నా.. రాబడి తక్కువ ఉన్నా సంక్షేమం ఆగలేదని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకం చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో విద్య కోసం రూ.29వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. వైఎస్సార్ పింఛను కానుక కోసం రూ. 18వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
దేశ చరిత్రలో డీబీటీ( Direct Benefit Transfer) స్కీమ్ ఎక్కడా లేదని తెలిపారు. డీబీటీ ద్వారా రెండేళ్లలో రూ. లక్షా 30 వేల కోట్లు బదిలీ చేశామని పేర్కొన్నారు. కులాలు, మతాలకతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దే ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపే బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు లెక్కలు లేవని అన్నారు. చిత్తశుద్ధితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
బడ్జెట్‌పై అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చ
బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ మొదలైంది.
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. వైట్,రెడ్, గ్రీన్ లైన్స్ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించిన మోషన్‌కు సభ ఆమోదం తెలిపింది. ఆ లైన్స్ దాటితే ఆటోమాటిక్‌గా సభ్యులు సస్పెన్షన్ అవుతారు. ఈ మేరకు రూల్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫార్స్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారు. సభను హుందాగా నడిపేందుకు ఈ కొత్త రూల్ తీసుకువచ్చామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ నుంచి టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేశారు. టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెన్షన్ చేశారు.
టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి: సీఎం జగన్
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా? నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలన్నారు.
సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్
టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు.
శాసనమండలిలో టీడీపీ హైడ్రామా..
శాసనమండలిలో మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు వెల్ లోకి వచ్చి ఆందోళన చేశారు. మరణాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధం కాగా, అయినా ఆందోళనను టీడీపీ సభ్యులు కొనసాగించారు.
టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ
శాసనమండలిలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు.
టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవు: మంత్రి బొత్స
టీడీపీకి ప్రజా సమస్యలు పట్టవని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన స్పీకర్ తమ్మినేని
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు.
సున్నా వడ్డీ పథకం ద్వారా 88,00, 626 సభ్యులకు లబ్ది: పెద్దిరెడ్డి
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 98,00, 626 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.. ఏపీ ప్రభుత్వం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి(2019-20, 21-22) 9,41,088 సంఘాల్లోని 88,00,626 సభ్యుల కోసం 2354 కోట్ల 22 లక్షలను రెండు విడతల్లో ఖర్చు చేసినట్లు తెలిపారు.
వృత్తిపరమైన వర్గాలను ఆర్థికంగా ఆదుకున్నాం
వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాల ద్వారా వెనుకబడిన తరగతులవారికి ఆర్థిక సాయం చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు వృత్తిపరమైన వర్గాలకు చెందిన సుమారు 11 లక్షల 73 వేల 18 మంది లబ్దిదారులకు 2,272.31 కోట్ల రూపాయలు వినియోగించామని తెలిపారు.
బీసీలకు నవరత్నాల కింద ఆర్థిక సాయం
వెనుకడిన తరగతులు, చేతివృత్తులవారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నవరత్నాల కింద వివిధ ఆర్థిక సహాయ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.
ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు: మంత్రి బుగ్గన
పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటివద్దే ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
శవ రాజకీయాలు ఇంకెన్ని రోజులు.. టీడీపీపై జోగి రమేష్ ఫైర్
శవ రాజకీయాలను టీడీపీ ఇంకెన్ని రోజులు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
లైవ్ వీడియో
కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు
శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు.
టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలే: మంత్రి బుగ్గన
ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలేనని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.
టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: శ్రీకాంత్‌రెడ్డి
టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రోజూ సభ ప్రారంభం కాగానే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. వ్యాట్ సవరణ బిల్లును సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు.
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. వ్యాట్ సవరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment