తిరుపతి, సాక్షి: మన దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని, అలాంటి వ్యవస్థ కలకాలం ఉండాలని దేవుడ్ని ప్రార్థించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ పరివారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ఈ విజయం సాధించాం. 2003లో వెంకటేశ్వరస్వామి నన్ను రక్షించారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తాను.
.. సంపదను సృష్టించడం ముఖ్యం. ఆ సంపద పేదలకు అందాలి. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పేదరికం లేని సమాజం కోసం నిత్యం పని చేస్తాను. నేను అందరివాడిని.. ఐదు కోట్ల మందికి ప్రజాప్రతినిధిని. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
.. నేటి నుంచి ప్రజా పాలన మొదలైంది. రాజకీయం ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదు. మంచివారిని కాపాడుకోవాలి.. చెడ్డవారిని శిక్షించాలి. పరిపాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెడతా. మా కుటుంబానికి నేనీమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ అండ్ కో.. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు తొలి ప్రెస్ మీట్‌పై ఏం సమాధానం చెబుతాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment