సాక్షి, రాజమహేంద్రవరం: తమ ప్రియతమ నేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ కష్టం చెప్పుకుంటే పరిష్కారమవుతుందని వారంతా భావించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో పింఛన్ వారోత్సవాలకు వచ్చిన సీఎంకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలను విన్న జగన్ వెంటనే స్పందించారు. కలెక్టర్ మాధవీలతను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. కాన్వాయ్ ఆపించి కిందకు దిగి మరీ సమస్యను విన్నారు.
తక్షణమే న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎంకు ఇచ్చిన వినతులపై కలెక్టర్ వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చకచకా పరిష్కారం చూపారు. బాధితులకు కలెక్టర్ మాధవీలత శనివారం ప్రభుత్వ సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, చెక్కులను, ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. తమ కష్టం చెప్పగానే సీఎం స్పందించి పరిష్కారం చూపడంతో బాధిత కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.
మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా
రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి పడుతున్న ఇక్కట్లను సీఎంను కలిసి బాధితుడి తండ్రి వివరించాడు. జగన్ ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష కలెక్టర్ అందజేశారు.
ప్రతినెలా రూ.5 వేలు పెన్షన్ అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగనన్నను కలిసినప్పుడు మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పడంతో కలెక్టర్ రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు.
– గులిన శ్రీ సాయి గణేష్ తండ్రి, లాలాచెరువు
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు..
నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి స్పైనల్ మసు్క్యలర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక కష్టం గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఆయన ఆదేశాల మేరకు బాలిక తల్లి సూర్యకుమారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సూర్యకుమారికి నిడదవోలు పీహెచ్‌సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం, పాపకి ప్రత్యేక కేటగిరీ కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం మంజూరు చేశారు.
మా అమ్మాయి శాంతి వైద్య సహాయం కోసం సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత తొందరగా ఆ హామీ నేరవేరుస్తారనుకోలేదు. మా కుటుంబ జీవనానికి భరోసా ఇచ్చేలా ఉద్యోగం కూడా ఇచ్చారు. నిడదవోలు మండలంలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సీఎం జగనన్న చల్లగా ఉండాలి.
– సి. సూర్యకుమారి, బాధితురాలి తల్లి, నిడదవోలు
పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం
రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో దుర్గా సురేష్‌కు ఉన్న చిరుద్యోగం కూడా ఇటీవల పోయింది. ఆయన సీఎం జగన్ దృష్టికి తన సమస్య నివేదించారు. సీఎం ఆదేశాల మేరకు దుర్గా సురేష్‌కు ఆర్‌ఎంసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తూ పునర్ నియామక ఉత్తర్వులు కలెక్టర్ అందచేశారు.
పాప ఆరోగ్యం కోసం రూ.లక్ష ఆర్థిక సహాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చాలామంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కలుగలేదు. సీఎం జగనన్నను కలిశాను. ఆయన వెంటనే స్పందించి కలెక్టరమ్మకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంటనే మనసు పెట్టి మా సమస్యలు పరిష్కరించారు. జగనన్న ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను.
– సిరికొండ దుర్గా సురేష్, రాజమహేంద్రవరం
జగనన్న మాటతోఉద్యోగం వచ్చింది...
రాజానగరం నామవరానికి చెందిన కాశాని దుర్గా శ్రీదేవి భర్త గతేడాది మార్చిలో మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదువులు చదివించేందుకు ఆర్థిక భరోసా కల్పించాలని దుర్గా శ్రీదేవి సీఎం జగన్‌ను కలిసి కోరింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కడియం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆమెకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగమిస్తూ నియామక ఉత్తర్వులను కలెక్టర్ శనివారం అందజేెశారు.
3వ తేదీన ముఖ్యమంత్రి జగనన్నను కలిసే అదృష్టం వచ్చింది.నాకు కష్టాలను చెప్పాను. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగనన్న స్పందించారు. ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను.
– కాశాని దుర్గా శ్రీదేవి, నామవరం
జగనన్న మనసున్న మారాజు...
రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన క్రిస్టఫర్ 25 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి ఇటీవల కలిశారు. సీఎం తెలుసుకుని న్యాయం చేయాలని ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీలో ప్లాట్ నంబర్ 53లో 77 చదరపు గజాల స్థలానికి చెందిన పట్టాను కలెక్టర్ మాధవీలత అందచేశారు.
ఒంటరిగా ఉంటున్న నాకు గతంలో ఎవరూ ఇంటి స్థలం ఇవ్వలేదు. జగనన్నను కలిసి కష్టం చెప్పుకున్నాను. ఆయన అంతా విన్నారు. ఇంటి స్థలమిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే నాకు ఇంటి స్థలం వస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రి‡ జగనన్నకు ధన్యవాదాలు.
– కె. క్రిస్టఫర్, రాజమహేంద్రవరం
(చదవండి: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు)
Comments
Please login to add a commentAdd a comment