AP CM YS Jagan Key Review Meeting On R&B - Sakshi
Sakshi News home page

ఏపీ రోడ్లపై విషప్రచారానికి అలా చెక్‌ పెట్టండి: ఆర్‌ అండ్‌ బీ సమీక్షలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Published Mon, Jan 23 2023 4:09 PM | Last Updated on Tue, Jan 24 2023 9:22 AM

AP CM YS Jagan Key Comments At R and B Review Meeting - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై దురుద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన రోడ్లు, భవనాల శాఖపై పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  

రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయండి. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయండి. మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం కనిపించకూడదు. కనీసం ఏడేళ్లైనా అవి పాడవ్వకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా నిర్వహణ కూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని అధికారులను ఆదేశించారాయన. ఇందుకోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తిచేయాలని సూచించారాయన.

నేల స్వభావంతోనే సమస్య..
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. అయితే.. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీని వాడితే ప్రయోజనం ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా.. అందుకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందన్న సీఎం జగన్‌.. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో చేపట్టాలని ఆదేశించారు. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలని సీఎం జగన్‌ అధికారులకు తెలిపారు. కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలని, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారాయన.

బాగు చేస్తున్నా.. విషప్రచారమే!
అధికారులతో సీఎం జగన్‌.. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ఆ వివరాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. ‘‘ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్‌ ప్రచారం తప్పట్లేదు. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా.. కంటగింపుతో విష ప్రచారం చేస్తున్నాయి. వాళ్ల కడుపుమంటకు మందులేదు. అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి.  ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి అని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.   

ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ ప్రారంభం
పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను ఈ సమీక్షా సమావేశంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఈ యాప్‌ ద్వారా రోడ్ల గురించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అలాగే.. ఫొటోలను సైతం అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉంది ఈ యాప్‌లో. జియో కోఆర్డినేట్స్‌తో పాటుగా ఫిర్యాదు నమోదుతో పాటు దీనిపై కమాండ్‌ కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే.. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు చేపడతారు అధికారులు.

రిపేర్‌ మాత్రమే కాదు..
నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు ఏ సమస్యలు రావని సీఎం జగన్‌.. అధికారులతో అన్నారు. పట్టణాలు, నగరాలు ఎక్కడైనా సరే రోడ్ల మరమ్మతులు నాణ్యమైన ప్రమాణాలతో జరగాలని పేర్కొన్నారాయన.  ఫలానా చోట రోడ్డు  రిపేరు చేయాలని ఏపీసీఎం ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు అందితే.. 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. అంతేకాదు.. యాప్‌ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. రోడ్ల మరమ్మతులపై అధికారులంతా ప్రత్యేక దృష్టిపెట్టాలి. కేవలం రిపేర్‌ మాత్రమే కాదు.. నాణ్యత మీదా ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్ల రిపేర్‌లో దీర్ఘకాలం నిలిచేలా టెక్నాలజీ సాయం తీసుకోండి. ఇకపైన కూడా రోడ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులు రావాలని సీఎం జగన్‌ అధికారుల వద్ద ఆకాంక్షించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement