సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం కరెంట్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలిసిన సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు, సీఎం జగన్ సూచించారు.
కాగా, వ్యవసాయ కూలీలున్న ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఘోరం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి&ఎంఎం) డి.వి. చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించారు.
ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ ( దర్గా హొన్నూర్) కె బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/ రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం &పి/ అనంతపురం) కె. రమేష్ ల నుంచి వివరణ కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment