బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్‌ ప్రత్యేక సమావేశం | AP CM YS Jagan Special Meeting On Badvel Bypoll | Sakshi
Sakshi News home page

Badvel Bypoll: బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published Thu, Sep 30 2021 12:37 PM | Last Updated on Thu, Sep 30 2021 3:19 PM

AP CM YS Jagan Special Meeting On Badvel Bypoll - Sakshi

సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.

2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని పేర్కొన్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని, ఓటింగ్‌ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. 

బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని అభ్యర్థించాలని సీఎం జగన్‌ అన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యపరచాలన్నారు. నెలరోజులపాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని తెలిపారు. బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశించారు.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

చదవండి: బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...

కాగా బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం విదితమే. అక్టోబర్‌ 1 న ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత డాక్టర్‌ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement