సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్
2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం
అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం
వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం
నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న సీఎం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.
అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. అనంతరం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు.
రాష్ట్ర భవిష్యత్తు.. విశాఖ
మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ విశాఖ నగరమేనని చెప్పారు. రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజిన్ వంటిదన్నారు. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. మంగళవారం రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్.. విశాఖ’ సదస్సులో సీఎం జగన్ పాల్గొని దాదాపు 2 వేల మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారని తెలిపారు. గతంలో విశాఖ వేదికగా జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందాల మేరకు అనేక పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయని వివరించారు.
వాటిలో పలు పరిశ్రమలు ఇప్పటికే పనులు ప్రారంభించాయని పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచి్చందన్నారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో పాటు ఫార్మా రంగంలో ఈ ప్రాంతానికి వస్తున్న పెట్టుబడుల గురించి పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ వివరిస్తారని తెలిపారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను సీఎం జగన్ సదస్సులో వివరిస్తారని తెలిపారు.
అలాగే గ్రేటర్ విశాఖ పరిధిలోని రూ.1,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ముడసర్లోవలో జీవీఎంసీ నూతన భవన నిర్మాణానికి, రూ.10 కోట్లతో టర్టెల్ బీచ్ ఏర్పాటుకు, వెంకోజీపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు నిరి్మంచనున్న డబుల్ రోడ్డుకు, మధురవాడకు కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లై ప్రాజెక్టుకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.98 కోట్లతో అభివృద్ధి చేసిన ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు.
సచివాలయంపైనా తప్పుడు రాతలు
సచివాలయ భవనాన్ని తాకట్టు పెట్టారంటూ కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాశాయని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. ఈ తప్పుడు వార్తలపై ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో సీఆర్‌డీఏ తీసుకున్న అప్పు తప్ప.. ఈ ప్రభుత్వం కొత్తగా అప్పు తీసుకోలేదని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి చెందకూడదనే దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు కేసులు పెట్టాయని మండిపడ్డారు. అయినా ముఖ్యమంత్రి జగన్ విశాఖను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment