టీడీపీ నాయకులు ఆ పార్టీ అధినేత కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రసిద్ధి చెందితే వీరు ప్రాంతానికో పాత్ర వేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడో మాట.. ఇక్కడో మాట.. పూటకో మాట.. మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై పాలి‘ట్రిక్స్’ చేస్తున్నారు. వీరి వ్యవహారం ఇపుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మదనపల్లె కేంద్రంగా జిల్లా కావాలని, రాజంపేట కేంద్రంగా ఉండాలని, రాయచోటి ఎంపిక సరైనదంటూ ఆయా ప్రాంతాల్లో పాలిట్రిక్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
రాజంపేట: అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యత.. భౌగోళిక పరిస్ధితులు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే అజెండాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయ అధ్యయనాలతో పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో రాజంపేట లోక్‌సభ పరిధిలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లతో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది.
ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో విషం కక్కుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రజలను రెచ్చగొట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
ఎవరెవరు..ఎలా
రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనపై రాజంపేట పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి తదితర నాయకులు ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అండ్ కో ఉద్యమం ముసుగేసుకొని రాజకీయచలి కాచుకుంటున్నారనే విమర్శలున్నాయి.
అలాగే మదనపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా జిల్లాల పునర్విభజనపై టీడీపీ ట్రిపుల్ యాక్షన్ ఎపిసోడ్‌లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక నిర్ణయమంటూ లేకుండా, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వీరు వ్యవహరించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు.
ఒక్కో చోట.. ఒక్కో మాట..
రాజకీయ పార్టీలు కీలక విషయాలకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆ పార్టీ నిర్ణయం మేరకు శ్రేణులు కట్టుబడతాయి. కానీ చంద్రబాబు సంగతి అలా కాదు. ఆయన ఒకే విషయంపై పలు రకాలుగా స్టాండ్ తీసుకుంటారు. రాజకీయలబ్ధి కోసం ఎలాంటి ప్రకటనలకైనా తెగబడిపోతారు. బాబుస్ఫూర్తితో ఆయనను మించి టీడీపీ నేతలు ప్రాంతానికి తగ్గట్టు స్వరాలను మారుస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మదనపల్లెలో జిల్లా కేంద్రం ఉండాలని అక్కడి తెలుగుదేశం నేతలు, రాజంపేటను కేంద్రంగా చేయాలని ఇక్కడి టీడీపీ శ్రేణులు నానా యాగీచేస్తున్నారు. రాయచోటిలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. వీరి తీరును పలువురు విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యవవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
టీడీపీ వైఖరి స్పష్టంచేయాలి
అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఆ నేతల తీరు అనుమానంగా ఉంది. ఒక పక్క రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నారు. మరోపక్క మదనపల్లెలోనూ అదే పాట పాడుతున్నారు. ఇంకోపక్క రాయచోటిలో ఆపార్టీ వారే కృతజ్ఞతలను తెలుపుతున్నారు. రాజకీయపార్టీలు స్పష్టమైన వైఖరి లేకుండా మాట్లాడటం సరైన విధానం కాదు.
–మేడా విజయశేఖర్‌రెడ్డి, జేఏసీ నాయకుడు, రాజంపేట
ఒకే నిర్ణయానికి కట్టుబడాలి
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కాకుండా అన్నమయ్య జిల్లాపై టీడీపీ స్పష్టమైన వైఖరి తెలపాలి. రాజకీయపార్టీల నాయకులు ఒకే నిర్ణయానికి కట్టుబడాలి. మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న టీడీపీ తీరును ప్రజలు గుర్తించాలి.
–దాసరి చిదానందగౌడ్, రాష్ట్రబీసీ సంక్షేమసంఘం నేత, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment