
తిరుపతి రూరల్: వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం 18వ రాష్ట్రస్థాయి సలహామండలి(ఎస్‌ఏసీ) సమావేశం జరిగింది.
అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని తెలిపారు.
ప్రభుత్వ ఖర్చుతోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, రైతుల నుంచి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినట్లు చెప్పారు. రానున్న 30ఏళ్ల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ‘సెకీ’ ద్వారా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆన్‌లైన్‌లో నిర్వహించామని, రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల నుంచి వినియోగదారులు తమ సూచనలు, సలహాలను తెలియజేశారని వివరించారు. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.