AP First Among States Spend The Most On Welfare Schemes - Sakshi
Sakshi News home page

‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం

Published Fri, Oct 7 2022 7:20 AM | Last Updated on Fri, Oct 7 2022 4:12 PM

AP First Among States Spend The Most On Welfare Schemes - Sakshi

సాక్షి, అమరావతి: సమాజంలో పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలపై భారీ మొత్తాలను ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థాన మని సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) హైకోర్టుకు నివేదించింది. కేంద్రం మంజూరు చేసిన పెన్షన్లకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లకు పొంతనే లేదని, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తోందని సెర్ప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) మహ్మద్‌ ఇంతియాజ్‌ హైకోర్టుకు వివరించారు.
చదవండి: వికేంద్రీకరణే ముద్దు 

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులకు నెలకు రూ.2,500, వికలాంగులకు నెలకు రూ.3 వేలు, తీవ్రమైన కిడ్నీ జబ్బులతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు చెల్లిస్తోందన్నారు. పెన్షన్ల అర్హత వయసు కూడా 65 నుంచి 60కి తగ్గించిందన్నారు.

పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాల జోక్యం తగదని ఆయన వివరించారు. ఇక వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద పెన్షన్‌ నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో జీఓ 174 జారీచేసిందని, దీని ప్రకారం.. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపునకు ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇందులో వృద్ధులకు, వితంతువులకు స్థానం కల్పించకపోవడం చట్ట విరుద్ధమంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, సెర్ప్‌ సీఈఓ, కేంద్ర గ్రామీ ణాభివృద్ధిశాఖ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. దీంతో ఇంతియాజ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో ఆయన ఏమని పేర్కొన్నారంటే..

కుటుంబంలో బహుళ పెన్షన్లకు అనుమతినిచ్చాం..
‘సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగానే ‘నవరత్నాలు’ పేరుతో పెద్దఎత్తున సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాలకు ఎంతో మంచి జరిగింది. ఓ కుటుంబంలో బహుళ పెన్షన్లకు అనుమతినివడంలేదన్న పిటిషనర్‌ వాదన సరికాదు. ఓ కుటుంబంలో 80 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఉంటే అతనికి పెన్షన్‌ మంజూరు చేస్తున్నాం.

అలాగే, తీవ్రమైన కిడ్నీ జబ్బులతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి సైతం కుటుంబ పెన్షన్లు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో దీనికి ఆస్కారంలేదు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చింది’ అని ఇంతియాజ్‌ వివరించారు.

అందరికీ అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం
‘రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 11 రకాల పెన్షన్లు అందచే స్తోంది. వీటికి అదనంగా వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి మరో 11 రకాల పెన్షన్లు ఇస్తోంది. సంక్షేమపథకాల సమర్థవంతమైన అమ లుకోసం స్వీయ మార్గదర్శకాలు రూపొందించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి సంక్షేమపథకాల కోసం నిధులు కేటాయిస్తు న్నప్పుడు సొంత మార్గదర్శకాలు రూపొందించు కునే అధికారం ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంటుం ది. ఈ అధికారాన్ని ఎవరూ కాలరాయలేరు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో సంక్షేమ పథకాల ఫలాలన్నీ కూడా అవసరమైన కుటుంబాలకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అధికార పార్టీకి చెందిన వారికి రెండో రేషన్‌ కార్డు ఇస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి ఇవ్వడంలేదన్న పిటిషనర్‌ వాదనలో వాస్తవంలేదు’.. అని ఇంతియాజ్‌ వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement