అరసవల్లి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కానుకను అందించనుంది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి.. భారీగా నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాదిమంది నిరుద్యోగులను ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు, పరిపాలన వికేంద్రీకరణలో సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో ఇంకా ఖాళీగా ఉన్న సచివాలయాల ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది.
ఈమేరకు అదనపు నోటిఫికేషన్‌ను ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా నిరుద్యోగుల కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తున్న క్రమంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ఆ తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల వాయిదాతోపాటు సచివాలయాల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో వచ్చే నెల మూడో వారంలో అర్హత రాత పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
జిల్లాలో 1187 పోస్టుల భర్తీ
కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో జి.చక్రధరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ ఈ నియామకాలకు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాలుండగా, వీటిల్లో 19 విభాగాల్లో 7884 పోస్టులను గుర్తించారు. గతేడాది 6697 పోస్టులను భర్తీ చేయగా, వివిధ కారణాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పలు పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఇలా ఖాళీగా ఉన్న 1187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా సుమారు 70 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 48,756 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరికే హాల్‌టిక్కెట్లు పంపిణీ చేయనున్నారు.
సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు
గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు వచ్చే నెల 20 నుంచి ఓ వారం రోజులపాటు రాతపరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయించింది. జిల్లాలో 19 విభాగాల్లో 1187 పోస్టులను భర్తీ చేసే క్రమంలో పరీక్షలను విభాగాల వారీగానే నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ స్ప్రే చేయాలని, థర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణ
రెండో విడత సచివాలయాల్లో పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేస్తున్నాం. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైనన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. తొలి విడత కంటే అభ్యర్థులు తగ్గినప్పటికీ వైరస్ ప్రభావం పడకుండా పరీక్ష కేంద్రాలను ఎక్కువగానే ఏర్పాటు చేస్తాం. 1187 పోస్టులకు 48,756 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
– జి.చక్రధరరావు, జిల్లా పరిషత్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment