రా..రమ్మంటున్న.. ఉద్యోగాలు!  | AP Govt Is Preparing To Fill Vacancies In Village And Ward Secretariat | Sakshi
Sakshi News home page

రా..రమ్మంటున్న.. సచివాలయ ఉద్యోగాలు! 

Aug 20 2020 1:28 PM | Updated on Aug 20 2020 1:31 PM

AP Govt Is Preparing To Fill Vacancies In Village And Ward Secretariat - Sakshi

విజయనగరం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికోసం సెప్టెంబర్‌ 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల గుర్తింపు పూర్తయినట్లు రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను చేపట్టారు. రిజర్వేషన్, రోస్టర్‌ పాయింట్ల ప్రకారం కొందరు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది రెండో విడతగా జనవరి 11న ప్రభుత్వ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్‌లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా జరగలేదు. ఆ తరువాత ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారని భావించినా కోవిడ్‌ ఉద్ధృతి తగ్గని నేపథ్యంలో మరోసారి వాయిదాపడింది. తాజాగా సెప్టెంబర్‌ 20వతేదీ నుంచి సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించడంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ తక్కువమంది అభ్యర్థులనే కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.   

నిరుద్యోగుల నుంచి అధిక పోటీ: 
జాతిపిత మహాత్మా గాం«ధీ కలలుకన్న గ్రామ స్వరాజ్య పాలన అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన సచివాలయ వ్యవస్థకు అనూహ్య స్పందన లభిస్తోంది. గతేడాది నుంచి ప్రారంభమైన వ్యవస్థ ద్వారా ప్రజలకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సేవలు సులభంగా అందుతున్నాయి. ఈనేపథ్యంలో గతంలో భర్తీ కాని మిగులు పోస్టులను ఈ ఏడాది భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెండవ విడతగా రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలో వివిధ పోస్టులు 1134 ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం ఆన్‌లైన్‌లో 48,276 దరఖాస్తులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. పరీక్షల ద్వారా 18 రకాల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో గ్రామీణ పరిధిలో 12, పట్టణ ప్రాంతాల్లో 6 ఉన్నాయి. ప్రతి ఉద్యోగానికి నిర్దేశిత విద్యార్హతలు తప్పక ఉండాలి. ప్రతి ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచారు. గత ప్రకటనతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది.
 

రాత పరీక్ష షెడ్యూల్‌ ఖరారు
విజయనగరం రూరల్‌: గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాత పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పి.రామచంద్రారెడ్డి, కమిషనర్లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పరీక్షల నిర్వహణపై పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. అలాగే వివిధ విభాగాల ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలను వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నిర్వహించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement