సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి మరింత వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనుమతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు సులభంగా పొందేలా పర్యాటక వాణిజ్యం(రిజిస్ట్రేషన్, సౌకర్యాలు)కు సంబంధించి శనివారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఏపీ టూరిజం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేరళ, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిన అనంతరం.. రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సులభతరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలను www.aptourism.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అందులోని కొన్ని వివరాలు..
► టూరు, బోట్ ఆపరేటర్లతో పాటు ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, రిసార్ట్సు, వాటర్ స్పోర్ట్స్ తదితర అనుబంధ రంగాల ఆపరేటర్లు రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం.
► టూరు ఆపరేటర్లు, అనుబంధ రంగాలకు చెందిన వారు ప్రభుత్వం అందించే రాయితీలు, ప్రోత్సాహకాలు సులభంగా పొందేలా నిబంధనలు. పర్యాటక కార్యకలాపాలు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రాష్ట్ర పర్యాటక శాఖలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
► సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు సులభతరమైన విధానాల్లో అనుమతులు.
► కాగా, పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థలకు ఇది ఒక మంచి అవకాశమని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీటీడీసీ సీఈవో, ఎండీ ప్రవీణ్ కుమార్ కోరారు.
పర్యాటక రంగ అభివృద్ధితో యువతకు ఉపాధి..
ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదు చేసుకోవడానికి సరైన యంత్రాంగం, విధివిధానాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలు తీసుకొచ్చాం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతం చేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు విధివిధానాలు రూపొందించాం.
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక మంత్రి
Comments
Please login to add a commentAdd a comment