AP High Court Files 11 Cases Against CM YS Jagan - Sakshi
Sakshi News home page

‘ఏపీ హైకోర్టు చర్య అసాధారణం’.. ఇదేమి సుమోటో!

Published Fri, Jun 25 2021 5:11 AM | Last Updated on Fri, Jun 25 2021 6:20 PM

AP HC itself files 11 cases against AP CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పలు కేసులను మూసి వేస్తూ ఆయా మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ సుమోటోగా హైకోర్టు విచారణ జరుపుతుండటంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ నిర్ణయం మేరకు ఈ వ్యవహారంపై సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది.

హైకోర్టు తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబరిచే విధంగా ఉందని న్యాయ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సహా, టీడీపీ నేతలపై లెక్కనేనన్ని కేసులు ఉన్నప్పటికీ ఈ తరహా చర్యలు వారికి వర్తించవా? ఒక్క జగన్‌ మాత్రమే లక్ష్యమా.. అని ఆశ్చర్య పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని చర్యలకు హైకోర్టు పూనుకోవడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోందని, ఇలాంటి చర్యలు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు. చట్టం నిర్ధేశించిన విధి విధానాలకు భిన్నంగా వెళ్లడం ఓ దుస్సంప్రదాయంగా మారి అనేక సమస్యలకు తీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేసులు మూసేయాలని బాబు తరహాలో జీవోలు ఇవ్వలేదే..
‘రాజకీయ నాయకులపై నమోదయ్యే కేసులను కొద్ది కాలం తర్వాత ఆయా ప్రభుత్వాలు ఆ కేసులను ఉపసంహరిస్తూ జీవోలు జారీ చేస్తుంటాయి. కానీ ప్రస్తుత వ్యవహారంలో కింది కోర్టులే తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చాయి. పోలీసులు దాఖలు చేసిన ఫైనల్‌ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకుంటే ఆ కేసులో రీ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఈ విషయంలో మేజిస్ట్రేట్‌కు పూర్తి అధికారాలున్నాయి. కోర్టుల్లో కేసుల మూసివేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదు. పోలీసులు దాఖలు చేసే ఫైనల్‌ రిపోర్ట్‌ ఆధారంగా కోర్టులు ముందుకు వెళతాయి. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు కేసును మూసి వేసేందుకు అభ్యంతరం చెప్పలేదు.

ఈ పరిస్థితుల్లో మేజిస్ట్రేట్లు ఆ కేసులను మూసివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మినహా చట్ట ప్రకారం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ మేజిస్ట్రేట్లపై ఫిర్యాదులు వస్తే అప్పుడు కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. పైపెచ్చు జగన్‌మోహన్‌రెడ్డిపై గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసులన్నీ ఒకే అంశానికి సంబంధించినవి. ఒకే అంశంపై బహుళ ఎఫ్‌ఐఆర్‌ల నమోదు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చింది. ఇటీవల రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది.

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. వాటి పట్ల స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ సుమోటో వ్యవహారమంతా మొన్నటి వరకు హైకోర్టులో కీలక స్థానంలో ఉండి బదిలీపై వెళ్లిన ఓ న్యాయమూర్తి, ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఉత్తరాధి రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తి నడిపిన తతంగమని న్యాయవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ 11 కేసులను మూసేస్తూ ఉత్తర్వులిచ్చిన మేజిస్ట్రేట్‌లలో అత్యధికులను అప్పటి కీలక న్యాయమూర్తి ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి.

తప్పుడు సంకేతాలకు తావివ్వరాదు
కోర్టులు తన అధికారాలను ఉపయోగించి జారీ చేసే ఉత్తర్వులకు, ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల ద్వారా ఇచ్చే ఉత్తర్వులకు తేడా ఉంది. ఇక్కడ ప్రభుత్వం తాను జీవో జారీ చేసి ముఖ్యమంత్రిపై కేసులను ఉపసంహరించలేదు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులపై విచారణ జరపాలని అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకుని, దానిని బెంచ్‌ ముందు ఉంచడం సబబు కాదు. దేని ఆధారంగా సుమోటోగా తీసుకోవాలో అందుకు సంబంధించిన ఆధారాలను, డాక్యుమెంట్లను ప్రతివాదులకు ఇవ్వాలి. ఆ వివరాలేవీ ప్రతివాదులకు ఇవ్వలేదు. కానీ ఓ పత్రిక, టీవీ చానెల్‌లో మాత్రం వచ్చేశాయి. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓ వ్యవస్థ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉందన్న తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఓ వర్గం చేస్తోంది.

– చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాది, విజయవాడ

హైకోర్టు చర్య అసాధారణం
హైకోర్టు చర్య అసాధారణం. సాధారణంగా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ సమీక్షించడం, తప్పుడు ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం పరిపాటే. కాని ఈ కేసులో మేజిస్ట్రేట్లు నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులిచ్చారు. ఇలాంటి ఉత్తర్వులపై అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ సమీక్షించి సుమోటోగా విచారణ జరపాలనుకోవడం వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే. అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ ఫిర్యాదుదారుగా వ్యవహరించరాదు. ఈ కేసుల్లో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదుదారు చెప్పలేదు.  అలాంటప్పుడు కేసు మూసివేతకు మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు ఇవ్వడంలో తప్పేమీ లేదు.

– ఎస్‌.శరత్‌ కుమార్, న్యాయవాది, విజయవాడ


నాడు తీవ్ర నేరాలపై కూడా కేసుల ఉపసంహరణ
హత్యాయత్నం.. అత్యాచారయత్నం.. దాడులు.. బెదిరింపులు.. ఇవేవీ సాధారణ నేరాలు కావు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులలో పిటిషన్లను ఉపసంహరించుకుంది. మరికొన్ని కేసులను ఏకంగా విచారణను మూసి వేసింది. ఎందుకంటే ఈ కేసుల్లో నిందితులు సామాన్యులు కారు. వారిలో చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ విధంగా ఏకంగా 28 కేసుల్లో 28 అభియోగాలపై విచారణను ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం ఏకంగా 21 జీవోలు జారీ చేసింది. మరో 131 కేసుల్లో ఏకంగా విచారణే అవసరం లేదని అర్ధంతరంగా క్లోజ్‌ చేసింది.

మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తి, కొల్లురవీంద్ర, నక్కా ఆనందబాబు, ఆ పార్టీ ప్రముఖులు రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు, అశోక్‌రెడ్డి, షాజహాన్‌ బాషా, సీహెచ్‌ ఆంజనేయులు, ఏ.ఆనందరావు, పతివాడ నారాయణస్వామి నాయుడు, వంగలపూడి అనిత, గొల్లపల్లి సూర్యారావు, మెట్ల సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్‌ తదితరులపై విచారణను అర్ధంతరంగా ముగించారు. ఇదిలా ఉండగా 2012లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో చంద్రబాబు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సభ నిర్వహించారు. దీనిపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదైంది. ఈ కేసు విచారణను బాబు సీఎంగా ఉన్న 2017లో అర్ధంతరంగా నిలిపి వేశారు.


2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ నేతలపై కేసులను ఎత్తివేస్తూ చంద్రబాబు సర్కార్‌ జారీ చేసిన జీవోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement