బాబుకు భంగపాటు  | AP High Court Dismisses Chandrababu Naidu Quash Petition In Skill Development Scam Case - Sakshi
Sakshi News home page

బాబుకు భంగపాటు 

Published Sat, Sep 23 2023 2:12 AM | Last Updated on Tue, Oct 10 2023 12:17 PM

AP High Court Dismisses Chandrababu Naidu Quash Petition - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భంగపాటు ఎదురైంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీకి సంబంధించి ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై సీఐడీ కేసును కొట్టేయడంతో పాటు, సీఐడీ కేసు ఆధారంగా ఏసీబీ కోర్టు తనకు రిమాండ్‌ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రద్దు చేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 

స్కిల్‌ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పింది. హైకోర్టు తన స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించి కేసును కొట్టేయాలని అభ్యర్థిస్తూ, నేర విచారణ ప్రక్రియ స్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 482 కింద దాఖలు చేసిన పిటిషన్‌లో ‘మినీ ట్రయల్‌’ నిర్వహించడానికి వీల్లే­దని హైకోర్టు స్పష్టం చేసింది. ‘దర్యాప్తు సంస్థ 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత 140 మంది సాక్షులను విచారించింది. 4 వేలకు పైగా డాక్యు­మెంట్లను సేకరించింది. 

నిగూఢమైన ఈ వ్యవహారంలో వృత్తి సంబంధ ప్రావీణ్యం కలిగిన నిపుణులే దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. దర్యాప్తు తుది దశకు చేరేందుకు వెసులుబాటు కల్పించే సీఐడీ కేసు విషయంలోనూ, తదనుగుణంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వుల విషయంలో ప్రస్తుతం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం 68 పేజీల తీర్పు వెలువరించారు.

అభ్యంతరం లేదన్నాకే న్యాయమూర్తి విచారణ 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు ఈ నెల 12న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా తనకు రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. 

చంద్రబాబు దాఖలు చేసిన ఈ క్వాష్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి రోజంతా విచారణ జరిపారు. విచారణకు ముందే ఆయన గతంలో తాను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించానని, ఇప్పుడు ఆయన కేసును విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా? అంటూ అటు సీఐడీ, ఇటు చంద్రబాబు తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ఇరుపక్షాలు కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్న తర్వాతే ఆయన విచారణ కొనసాగించారు. 

అటు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, సిద్దార్థ లూథ్రా, ఇటు సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌ కుమార్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు విన్నారు. సెక్షన్‌ 17–ఏ పై చంద్రబాబు న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న నేపథ్యంలో న్యాయమూర్తి తాను మధ్యంతర ఉత్తర్వులు కాకుండా ప్రధాన వ్యాజ్యంలోనే ఉత్తర్వులు జారీ చేస్తానంటూ తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పును వెలువరించారు. చంద్రబాబు పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు చెప్పారు.

దర్యాప్తునకు సమయం ఇవ్వాలి
‘భజన్‌లాన్‌ కేసు మొదలు నిహారికా కేసు వరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 కింద హైకోర్టు తన పరిధిని ఉపయోగించే విషయంలో సుప్రీంకోర్టు నిర్ధిష్టమైన పలు కొలమానాలను నిర్ధేశించింది. సుప్రీంకోర్టు నిర్ధేశించిన ఆ కొలమానాలేవీ కూడా ఈ కేసులో ఇప్పుడు జోక్యం చేసుకునేందుకు అనుమతించడం లేదు. ప్రస్తుత కేసులో సీఐడీ చంద్రబాబును 2023 సెప్టెంబర్‌ 7న 37వ నిందితునిగా చూపింది. 2023 సెప్టెంబర్‌ 9న ఆయన్ను అరెస్ట్‌ చేసింది. కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు 2023 సెప్టెంబర్‌ 12న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే రీతిలో మరిదాస్‌ కేసులోనూ జరిగింది. మరిదాస్‌పై 2021 డిసెంబర్‌ 9న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 2021 డిసెంబర్‌ 10న కేసు కొట్టేయాలంటూ మరిదాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

2021 డిసెంబర్‌ 14న మద్రాసు హైకోర్టు మరిదాస్‌పై కేసు కొట్టేసింది. మద్రాసు హైకోర్టు తీర్పును ఆ తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించే ముందు ఏం చేయాలో సుప్రీంకోర్టు ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. దర్యాప్తు సంస్థకు దర్యాప్తు చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండా కేసు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు సంస్థకు సహేతుక సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

ఆర్థిక నేరాల విషయంలో భిన్న దృక్పథం 
‘వాస్తవానికి లలిత కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విచారణకు స్వీకరించతగ్గ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే. సీఆర్‌పీసీ సెక్షన్‌ 154కు అనుగుణంగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడం తప్పనిసరి. ఈ కేసులో రికార్డుల్లో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లో సెక్షన్‌ 17–ఏను చేర్చడానికి ముందే ప్రాథమిక విచారణ జరిగింది. కేసు నమోదుకు కారణమైన ఫిర్యాదు ఆధారంగా ఆ విచారణ జరిగింది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు న్యాయస్థానాల దృక్పథం భిన్నంగా ఉండాలి. మరో ముఖ్యమైన విష­యం ఏమిటంటే చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటన్న దాన్ని కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలి’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే వారి కోసమే సెక్షన్‌ 17–ఏ
చిత్తశుద్ధితో, సదుద్దేశంతో అధికారిక బాధ్యతలను, విధులను నిర్వర్తించే పబ్లిక్‌ సర్వెంట్‌లను కాపాడేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 17–ఏను చేర్చారు. శాసనసభకర్తల ఉద్దేశం కూడా ఇదే. అయితే పబ్లిక్‌ సర్వెంట్‌ చర్యలు నేరపూరితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, ఆ చర్యలు నేరమైనప్పుడు వాటిపై విచారణ జరిపేందుకు పీసీ యాక్ట్‌లోని సెక్షన్‌ 17–ఏ కింద ముందస్తు  అనుమతి అవసరం లేదు. నిధుల దుర్వినియోగం, తప్పుడు అకౌంట్లు సృష్టించడం, మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, లంచాలు తీసుకోవడం వంటివి సెక్షన్‌ 17–ఏ పరిధిలోకి రావు. 

ప్రస్తుత కేసులో చంద్రబాబు నిధుల చెల్లింపు విషయంలో తీసుకున్న నిర్ణయం లేదా చేసిన సిఫారసు, ఆయన చేసిన నిధుల దుర్వినియోగం.. అధికారిక విధులు, బాధ్యతల కిందకు రావు. అందువల్ల ఆ నేరాలపై దర్యాప్తు చేసేందుకు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు. 2018 జూలై 26కు ముందు జరిగిన అన్ని కేసులకు సెక్షన్‌ 17–ఏ వర్తించదు. పబ్లిక్‌ సర్వెంట్‌ తన అధికారిక విధులను నిర్వర్తిస్తూ నేరానికి పాల్పడినప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది. అధికార విధుల్లో భాగం కాకుండా నేరానికి పాల్పడితే సెక్షన్‌ 17–ఏ వర్తించదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో వివరించారు.

►న్యాయమూర్తి తన తీర్పులో చంద్రబాబుపై ఉన్న ఆరోపణలను సైతం స్పష్టంగా వివరించారు. ‘చంద్రబాబు, ఇతర నిందితులు కలిసి కుట్ర­పూరితంగా ప్రజా ఖజానాకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారు. రూ.110 కోట్ల నుంచి రూ.130 కోట్లతో మాత్రమే అమలు చేసే ఓ ప్రాజెక్టును రూ.3,300 కోట్లుగా మోసపూరితంగా చూపారు. రూ.371 కోట్ల విలువైన వర్క్‌ ఆర్డర్‌ను నామినేషన్‌ ప్రాతిపదికన ఇచ్చేశారు. 

►ఇందులో కనీసం రూ.241 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగింది. చంద్రబాబు, ఇతర నిందితులు కలిసి కుట్రపూరితంగా మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేశారు. 

►చంద్రబాబు నాయుడు రూ.3,300 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు 90 శాతం ఖర్చును భరిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం) చెల్లిస్తే సరిపోతుందని మంత్రులకు చెప్పి, ఆ మొత్తాన్ని ఆ సంస్థలకు విడుదల చేయించేందుకు అనుమతి పొందారు.

►మంత్రి మండలి తీర్మానం, జీవో ఎమ్మెస్‌ నెంబర్‌ 4 ప్రకారం సాంకేతిక సాయం అందిస్తున్న సీమెన్స్, డిజైన్‌టెక్‌ల నుంచి ఆ 90 శాతం గ్రాంట్‌ ఆన్‌ ఎయిడ్‌గా వస్తుందని పేర్కొన్నారు. కొన్ని వారాల తర్వాత సీమెన్స్‌ అప్పటి ఎండీ, ఈ కేసులో 6 నిందితుడు ఆ మొత్తాన్ని గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌గా చెబుతూ.. చంద్రబాబును, ఆర్థిక శాఖ కార్యదర్శిని ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన 10 శాతం మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. 

►జీవో ఎమ్మెస్‌ 4లో నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే వాటిని ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టి ముసాయిదా ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు. ఈ ముసాయిదా ఒప్పందాన్ని సీమెన్స్, డిజైన్‌టెక్‌కు నామినేషన్‌ పద్దతిలో కట్టబెట్టే రీతిలో తయారు చేశారు. రూ.371 కోట్లను ముందునే ఆ కంపెనీలకు ఇచ్చేశారు. 

►కేంద్ర దర్యాప్తు సంస్థలైన డీజీజీ ఎస్‌ఐటీ ఆఫీస్‌ పూణే, ఆదాయపు పన్ను శాఖ, సీమెన్స్‌ అంతర్గత విచారణ, ఏపీఎస్‌ఎస్‌డీసీ చేపట్టిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో రూ.241 కోట్లను బోగస్‌ ఇన్వాయిస్‌ల ద్వారా, షెల్‌ కంపెనీల ద్వారా దుర్వినియోగం చేసినట్లు తేలింది. చంద్రబాబు పర్సనల్‌ సెక్రటరీగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస అనే వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసు ఇచ్చింది. ఆ వ్యక్తి ఆమెరికా పారిపోయారు.

►సీమెన్స్‌ ఇండియా యాజమాన్యం ఈ కేసులో 6వ నిందితుడితో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. గ్రాంట్‌ ఆన్‌ ఎయిడ్‌ కింద 90% ఇచ్చేలా తాము ఎలాంటి స్కీంను చేపట్టలేదని కూడా సీమెన్స్‌ స్పష్టం చేసింది. రికార్డును పరిశీలిస్తే ఆడిట్‌ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆడిట్‌ నివేది­కను పరిశీలిస్తే, రూ.241.78 కోట్ల మేర నిధులను మళ్లించి­నట్లు తెలుస్తుంది. ఈ మొత్తంతో పాటు షెల్‌ కంపెనీల ద్వారా మరో షెల్‌ కంపెనీ అయిన ఏసీఐకి చెల్లింపులు కూడా చేశారు’ అని న్యాయ­మూర్తి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు.    

ఇది కూడా చదవండి: చంద్రబాబు లాయర్‌ లూథ్రాకు ఆర్జీవీ చురక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement