సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం నిర్మాణంలో రాబోయే నాలుగు ఐదు నెలలు కీలకమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వేల ఏళ్లపాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు అని, అందుకే కాస్త ఆలస్యమైనా నాణ్యత విషయంలో రాజీపడబోమని తెలిపారాయన. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆపై మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపిన మంత్రి అంబటి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని మరోసారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని చెప్పారాయన. పోలవరంపై తానేం రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారాయన. ఇది తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవగాహనారాహిత్యం, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతోనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల ఇంత అనర్థం జరిగిందని స్పస్టం చేశారు.
డయాఫ్రమ్‌వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని, చర్యల సంగతి ప్రాజెక్టు పూర్తైన తర్వాతేనని చెప్పారాయన. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని.. నిపుణులు చెప్తున్న మాట అని మంత్రి అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందుకు వెళ్లాలి. ఏ విధంగా రిపేర్ చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని మరోసారి స్పష్టం చేశారాయన. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్‌లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరదల వల్ల డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ తొందరపాటుతోనే ప్రాజెక్టకు నష్టం జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు తప్పిదం తప్ప మరొకటి లేదు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలి. దీని కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్‌లైన్‌లు ఎందుకు? వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అందుకే పనులు కాస్త ఆలస్యమైనా నాణ్యతగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారాయన. వైఎస్‌ఆర్ కలలు కన్న ప్రాజెక్టు ఇది. సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి.
ఇదీ చదవండి: ఏపీ ఓ బంగారు గని
Comments
Please login to add a commentAdd a comment