AP Stamps And Registration IG Ramakrishna Press Meet On Margadarsi - Sakshi
Sakshi News home page

‘మార్గదర్శి’ రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవు: ఐజీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

Published Fri, Dec 9 2022 6:50 PM | Last Updated on Sat, Dec 10 2022 2:44 AM

AP Stamps And Registration IG Ramakrishna Press Meet On Margadarsi - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ చిట్స్‌ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా, అడిగిన సమా­చారం ఇవ్వకుండా అడ్వర్టైజ్‌మెంట్‌ ఇవ్వడం ఏమిటని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ వి రామకృష్ణ ప్రశ్నించారు. తాము అడిగిన సమాచారం వారు ఇచ్చి ఉంటే, అది తాము సంతృప్తి చెందేలా ఉంటే సంతోషించే వారిలో తానే ప్రథముడినని చెప్పారు. అలా జర­గ­నందునే పలు సందేహాలొస్తున్నాయని, అందువల్ల చిట్స్‌ వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 

విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన చిట్‌ఫండ్‌ చట్టంపై చిట్స్‌ డిప్యూటీ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లతో సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌లో నమ్మకం, అవమానం, నిప్పు, అబద్ధాలు.. వంటి కొన్ని పదాలు వాడారని, వాటితో తమకు పని లేదన్నారు. నిజాలు, సమాచారం, అంకెలు ఆధారంగానే తాము పని చేస్తామని చెప్పారు. వాస్తవాలు చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు ఇచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ తనకు తానే సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చుకుంటే సరిపోదని, తాము అడిగిన సమాచారం ఇవ్వాలని, బ్యాలెన్స్‌ షీట్లు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐజీ ఇంకా ఏమన్నారంటే..

అది మా బాధ్యత..
– ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేయాలని లేదు. ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు మేము ఎప్పుడైనా తనిఖీలు చేయొచ్చు.. చేస్తాం కూడా. ప్రతి ఏడాది వారు వివరాలు సమర్పించాలి. మేము అడిగిన సమాచారం ఇవ్వనందునే ఇదంతా చెప్పాల్సి వస్తోంది. వారు సమాచారాన్ని ఇవ్వక పోవడం వల్లే సందేహించాల్సి వస్తోంది. తప్పులు జరిగాయని భావించాల్సి వస్తోంది. అందువల్ల చిట్‌లు వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఒకవేళ ఫిర్యాదు వస్తే.. సీబీఐ, ఈడీ, పోలీసు వంటి సంస్థలు దర్యాప్తు చేస్తాయి.
– మార్గదర్శి కార్పొరేట్‌ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఏపీకి సమాచారం ఇచ్చేది లేదని ప్రకటనలో పేర్కొంటే కుదరదు. ఏపీలో మార్గదర్శి కంపెనీ లక్ష మంది చందాదారులతో 2,345 చిట్లు నిర్వహిస్తోంది. వాటన్నింటినీ ఇక్కడి నుంచి నిర్వహిస్తూ బ్యాలెన్స్‌ షీట్లు ఎక్కడ ఇస్తారు? రిజిస్ట్రార్‌కి రికార్డులు ఇచ్చామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ లెక్కన వాటిని తెలంగాణ, కర్ణాటక అధికారులకు ఇచ్చారా? 
– మార్గదర్శి యాజమాన్యం వారికి అనుకూలంగా నిబంధనలను చూపిస్తోంది. చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 21ని చూపిస్తూ తమ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఏపీకి జవాబుదారీ కాదనడం సరికాదు. సెక్షన్‌ 19, 24లను కూడా వారు చదవాలి. ఇక్కడి కార్యకలాపాలకు మాకు బ్యాలెన్స్‌ షీట్లు ఇవ్వాల్సిందే. 

ఫోర్‌మెన్స్‌కు అధికారాలు లేవంటే ఎలా?
– ఏపీలో మార్గదర్శి నిర్వహించే కార్యకలాపాలపై ఏదైనా సమస్య వస్తే తెలంగాణ, కర్ణాటక అధికారులు చూస్తారా? ఫోర్‌మెన్స్‌కు ఎటువంటి అధికారాలు లేవని చెబుతున్నారు. ఇది సరికాదు. అలాగైతే కొత్త చిట్స్‌కు అనుమతి ఇవ్వం. డిపాజిట్లు ఎక్కడున్నాయో, వాటిని ఎలా వినియోగిస్తున్నారో ఫోర్‌మెన్లకు తెలియాల్సిందే.
– ఎవరూ అడక్కుండానే చిట్‌ఫండ్‌ కంపెనీలు తమ కార్యకలాపాలు, బ్యాలెన్స్‌ షీట్ల వివరాలను చిట్స్‌ రిజిస్ట్రార్లకు ఇవ్వాలి. కానీ ఎనిమిదేళ్లుగా మార్గదర్శి రికార్డులను సమర్పించడం లేదు. అందువల్ల త్వరలో హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో నిపుణులతో ఆడిట్‌ నిర్వహిస్తాం. 
– అన్నీ సక్రమంగా నిర్వహిస్తుంటే ఎందుకు భయపడుతున్నట్లు? ఆ కంపెనీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచిన డాక్యుమెంట్‌ ప్రకారం చిట్‌ఫండ్‌ నిధులు ఇతర సంస్థలకు మళ్లించినట్లు స్పష్టమైంది. మార్గదర్శి సహా రాష్ట్రంలోని 35 చిట్‌ఫండ్‌ కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించాం. ఒక్క మార్గదర్శి
తో తప్ప మిగిలిన కంపెనీలతో ఎటువంటి సమస్యా రాలేదు.  

ఈ ప్రశ్నలకు బదులేదీ?
– చిట్స్‌ రిజిస్ట్రార్లకు రికార్డులు సమర్పించకుండా అడ్వర్టైజ్‌మెంట్‌ ఇవ్వడం ఏమిటి?
– అందులో మీకు అనుకూలంగా చెప్పుకుంటారా? మీకు మీరే సెల్ఫ్‌ సర్టిఫికేషనా?
– మీ కార్పొరేట్‌ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటే ఏపీలో రికార్డులు చూపరా?
– మీరు ఏపీలోనూ చిట్‌ఫండ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది నిజం కాదా? 
– ఏ రిజిస్ట్రార్‌కు బ్యాలెన్స్‌ షీట్లు ఇచ్చారు? కర్ణాటక రిజిస్ట్రార్‌కా.. లేక తెలంగాణ రిజిస్ట్రార్‌కా?
– ఎలాంటి అధికారాలు ఇవ్వకుండానే ఫోర్‌మెన్‌ (మేనేజర్‌ తరహా పోస్టు)లను నియమించారా?
– రాష్ట్ర విభజన తర్వాత నుంచి మీరు ఏపీలో రికార్డులు చూపక పోవడం నిజం కాదా?
– చిట్‌ఫండ్‌ నిధులు ఇతర సంస్థలకు మళ్లించడం నిజం కాదా?
– రాష్ట్రంలో 35 చిట్‌ఫండ్‌ కంపెనీల్లో మీరొక్కరే ఎందుకు సహకరించడం లేదు?
– అంతా సరిగ్గా ఉంటే ఎందుకు భయపడుతున్నారు?. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement