సాక్షి, అమరావతి: బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) హవా కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ సంస్థ చేయని విధంగా అమెరికాకు బెరైటీస్ ఎగుమతి చేస్తున్న ఏపీఎండీసీ... ప్రతి సంవత్సరం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. అమెరికా(యూఎస్‌ఏ) బెరైటీస్ మార్కెట్‌లో రెండేళ్ల కిందట ఏపీఎండీసీ వాటా 30 శాతం కాగా, గత ఏడాది 44 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 54 శాతానికి చేరింది. తాజాగా ఈ విషయాన్ని అంతర్జాతీయ బెరైటీస్ అసోసియేషన్ ప్రకటించింది.
అమెరికా మార్కెట్‌లో ఒక దేశంగానీ, సంస్థగానీ ఇంత శాతం మార్కెట్‌ను చేజిక్కించుకోవడం ఇదే ప్రథమం అని తెలిపింది. గతంలో అమెరికాకు 60శాతానికి పైగా బెరైటీస్‌ను చైనా ఎగుమతి చేసేది. అయితే 2015 నుంచి చైనా ఎగుమతులు క్రమంగా తగ్గుతూ ఉండగా, మన దేశం నుంచి పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మన బెరైటీస్ పైనే అమెరికా మార్కెట్ ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. మన దేశం నుంచి ఎగుమతయ్యే బెరైటీస్‌లో 90శాతానికి పైగా వైఎస్సార్ జిల్లా మంగంపేట గనుల నుంచే ఉత్పత్తి అవుతోంది.
ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం కృషి
బెరైటీస్‌కు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకుంది. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకువచ్చేందుకు అమెరికాలోని పలు చమురు ఉత్పత్తి సంస్థలతో ఏపీఎండీసీ ద్వారా ఒప్పందాలు చేసుకుంది. గతంలో కొన్ని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా బెరైటీస్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు విక్రయించేది.
బెరైటీస్ అవసరం ఉన్న చమురు సంస్థలకే నేరుగా ఖనిజాన్ని విక్రయించేందుకు ఏపీఎండీసీ ద్వారా ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న ఎగుమతుల ఒప్పందాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించింది. ఒకసారి ఒప్పందం చేసుకుంటే మూడేళ్లు స్థిరంగా ఎగుమతులు చేసే అవకాశాన్ని సృష్టిం చింది. గత ఏప్రిల్‌లో 25శాతం ధర పెంచినా ఎగుమతులపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
దీంతో చైనా, మెక్సికో, మొరాకో వంటి బలమైన పోటీదారులను కూడా దాటి అత్యధిక శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 మిలియన్ టన్నుల బెరైటీస్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్‌పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ.1,300 కోట్లకు పెరిగింది. తాజా వ్యూహాలతో డిమాండ్ లేని సీ, డీ గ్రేడ్ బెరైటీస్ ఖనిజానికి సైతం డిమాండ్ ఏర్పడింది.
సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో మంచి ఫలితాలు
బెరైటీస్ ఎగుమతులకు సంబంధించి గతంలో అమలు చేసిన వ్యూహాన్ని మార్చుకుని కొత్తగా ముందుకెళ్లడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గనులు, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ బెరైటీస్ మార్కెట్‌లో ఏపీఎండీసీ అగ్రస్థానంలో నిలవడం ఎంతో ముఖ్య పరిణామం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్ ఎండీ, ఏపీఎండీసీ
అత్యంత నాణ్యత
అన్నమయ్య జిల్లా మంగంపేటలో బెరైటీస్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రే బెరైటీస్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. మన దేశంలో ఉన్న బెరైటీస్ నిక్షేపాల్లో 98శాతం మంగంపేటలోనే ఉండటం విశేషం. మంగంపేటలో గనుల్లో సుమారు 74 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 30దేశాలకు బెరైటీస్ ఎగుమతి అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, సహజవాయువు ఉత్పాదక కంపెనీలకు మంగంపేట నుంచి వెళ్లే బెరైటీస్ వాటా 25 శాతంగా ఉంది. చమురు, సహజవాయువుల రంగానికి బెరైటీస్ అత్యంత కీలకం కావడం,
అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇది దొరకడంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment