
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు అవసరమైన రాగులు, జొన్నల సరఫరాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంగీకరించినట్టు చెప్పారు. బియ్యంతో పాటు రేషన్ కార్డుదారులకు రెండు కిలోల గోధుమ పిండిని పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి తణుకు నియోజకవర్గంలోనూ ప్రారంభిస్తున్నామని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా గోధుమ పిండి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రమంతా బలవర్ధక ఆహారాన్ని అందించే ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్నిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో గురువారం మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజనులకు అందించేందుకు లక్ష అంత్యోదయ రేషన్‌కార్డులను కోరగా.. కేంద్రమంత్రి పీయూ‹Ùగోయల్ అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి రేషన్ కార్డునూ తొలగించట్లేదని, కేవలం అనర్హులవి మాత్రమే తొలగిస్తున్నట్టు చెప్పారు.
2012 నుంచి 2018కి మధ్య రాష్ట్రానికి రావాల్సిన రూ.1,702 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసే విషయంలో కేంద్ర మంత్రి, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శిలతో చర్చించామన్నారు. ఏపీలో స్మార్ట్ పీడీఎస్‌లో భాగంగా అమల్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును పీయూ‹Ùగోయల్ అభినందించి.. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. లోకేశ్, చంద్రబాబు, అయ్యన్నపాత్రుడే ఏపీలో గంజాయి మాఫియా నిర్వహిస్తున్నారని, జగన్ సీఎం అయ్యాక గంజాయిని పెద్ద ఎత్తున నియంత్రించినట్టు మంత్రి కారుమూరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment