అక్కడి అరాచకాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది | Assam DIG Shivaprasad From AP Key Officer Deben Dutta Lynching Case | Sakshi
Sakshi News home page

డీఐజీ‌ శివప్రసాద్‌.. అసోంలో ఆంధ్రుడి సత్తా

Published Fri, Oct 23 2020 8:03 PM | Last Updated on Fri, Oct 23 2020 8:24 PM

Assam DIG Shivaprasad From AP Key Officer Deben Dutta Lynching Case - Sakshi

సాక్షి, అమరావతి: అసోం రాష్ట్రంలో ఆంధ్రుడి సత్తాకు అరుదైన గుర్తింపు లభించింది. ఒక టీ ఎస్టేట్‌ డాక్టర్‌ మూకహత్య కేసులో అసోంలోని జోర్‌హట్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ నెల 20న ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసులో ఒకరికి ఉరిశిక్ష, 24 మందికి జీవితఖైదు విధించారు. దేశ న్యాయ చరిత్రలోనే అరుదైన రికార్డు అని పలువురు పేర్కొంటున్న ఈ కేసు దర్యాప్తును ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఐపీఎస్‌ అధికారి డీఐజీ డాక్టర్‌ జీవీ శివప్రసాద్‌. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురానికి చెందినవారు. 

పీహెచ్‌డీ చేస్తూ ఐపీఎస్‌కు..
డాక్టర్‌ శివప్రసాద్‌ తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపురం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. తల్లి సరోజిని గృహిణి. అగ్రికల్చరల్‌ ఎమ్మెస్సీ చదివిన శివప్రసాద్‌ న్యూఢిల్లీలో పీహెచ్‌డీ చేస్తూ సివిల్స్‌ రాశారు. ఐపీఎస్‌కు ఎంపికై అసోం–మేఘాలయ కేడర్‌లో నియమితులయ్యారు. అసోంలోని బార్‌ పెట్, దరాంగ్, నార్త్‌ కచార్, కర్బి అంగ్‌ లాంగ్‌ వంటి జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. అస్సాంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి వినూత్న పద్ధతులు అవలంబించిన శివప్రసాద్‌.. నిర్భీతిగా, నిజాయితీతో పనిచేస్తారని పేరొందారు.(చదవండి: మర్మమెరుగని కర్మయోగి.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గిరిజన సేవకు)

మూకహత్య కేసులో తనదైన ముద్ర..
అసోంలోని త్యోక్‌ టీ ఎస్టేట్‌లో డాక్టర్‌ దేబెన్‌ దత్తా (73) మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది ఆగస్ట్‌ 31న ఒక వర్కర్‌కు చికిత్స అందించడంలో జాప్యం జరిగిందంటూ ఎస్టేట్‌లోని తేయాకు కార్మికులు ఆగ్రహించారు. మూకుమ్మడిగా మారణాయుధాలతో డాక్టర్‌ దేబెన్‌ దత్తాపై దాడిచేశారు. తీవ్రంగా  గాయపడిన దేబెన్‌ దత్తాను వైద్యానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. నలభై ఏళ్లుగా అదే టీ ఎస్టేట్‌లో వైద్యసేవలందిస్తున్న దత్తాను మూకహత్య చేయడంపై అసోంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చెలరేగాయి. శాంతిభద్రతల సమస్యగా మారింది.

దీంతో జోర్హట్‌ డీఐజీగా ఉన్న శివప్రసాద్‌ స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తొలి మూడురోజుల దర్యాప్తులోనే 22 మంది ఎస్‌ఐలు భాగస్తులయ్యారు. 60 మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలను వీడియో రికార్డింగ్‌ చేశారు. సాక్ష్యాలను మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయించారు. సీసీ కెమెరాల ఫుటేజి సేకరించారు. హత్యజరిగిన పదిరోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి 21 రోజుల్లోనే 602 పేజీల చార్జిషీట్‌ దాఖలుచేశారు. 32 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు మృతిచెందగా మిగిలిన 31 మందిపై విచారణ కొనసాగింది. ఏడాదిలో విచారణ పూర్తిచేసిన కోర్టు ఈనెల 20న తీర్పు ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, 24 మందికి యావజ్జీవశిక్ష విధించింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో డాక్టర్‌ శివప్రసాద్‌ పేరు మరోసారి మారుమోగింది.

కత్తిమీద సామే.. అయినా గర్వంగా ఉంది..
అసోంలోని టీ ఎస్టేట్‌లలో జరిగే అరాచకాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక్కడ పోలీసు ఉద్యోగం కత్తిమీద సామే. అయినా అనేక  కేసుల్లో దోషులకు శిక్షలు పడేలాచేసి శాంతిభద్రతలు కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది. అసోం రాష్ట్రంలోని జనాభాలో 25 శాతం మంది టీ ఎస్టేట్‌లలోనే  ఉంటారు. టీ ఎస్టేట్‌లలో ఎటువంటి ఘటన జరిగినా.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారుతుంది. అందుకే చాలా సమస్యలను సున్నితంగా డీల్‌ చేయడంతోపాటు అరాచకశక్తుల ఆటకట్టించడంలో కఠినంగా ఉంటాం. ఎన్నో కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేసిన నాకు.. డాక్టర్‌ మూకహత్య కేసులో న్యాయస్థానం తీర్పు మరిచిపోలేనిది.
– డీఐజీ శివప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement